అమెరికా కోర్టు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గట్టి షాకే ఇచ్చింది. అమెరికాలో నివసిస్తున్న హెచ్-1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ల అంశంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు భారీ ఊరటనిచ్చింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన వర్క్ పర్మిట్లను రద్దు చేయాలన్న ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. దీంతో నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. అంతేకాదు… తుది తీర్పును కూడా నిలిపివేయాలని కోరింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్లు కల్పిస్తూ ఒబామా సర్కార్ హెచ్-4వీసా విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది. దీని ఫలితంగా అనేక మంది అమెరికా వాసులు నష్టపోతున్నారని ట్రంప్ సర్కార్ భావించి హెచ్ 4 వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్ వ్యవహార శైలికి గట్టి షాక్ గా ప్రవాస భారతీయులు అభివర్ణిస్తున్నారు.