మనిషి ముఖ పోలికలతో గల ఓ చేప దక్షిణ చైనాలోని మియావో అనే గ్రామంలో కనిపించి పర్యాటకులను కనువిందు చేసింది. కన్మింగ్ అనే పర్యాటక ప్రాంతంలో కనిపించిన మనిషి పోలికలతో గల ఈ చేపను సందర్శకులు 15 సెకన్లపాటు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇటువంటి చేపలు చాలా అరుదని, గతంలో తైవాన్, బ్రిటన్ దేశాల్లో కనిపించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రకటించాయి. బ్రిటన్ లో 2010 సంవత్సరంలో ఓ బిచ్చగానికి అరుదైన ఈ చేప కనిపించింది. అయితే బ్రిటన్ లో అప్పట్లో కనిపించిన ఈ చేప పక్కవైపు నుంచి మామూలుగానే ఉండేది. ‘కార్ప్’ జాతికి చెందిన ఈ చేప పైనుంచి మాత్రం కళ్లు, ముక్కు, నోరు అచ్చు మనిషి ముఖాన్ని పోలి ఉండడం విశేషం. తైవాన్ లో మాత్రం 2011లో స్థానిక ప్రభుత్వం నిర్వహించే పాండ్ లో మనిషి పోలికలతో గల కార్ప్ జాతి చేప కనిపించింది. అయితే తైవాన్ లో కనిపించిన చేప మాత్రం నలుపు, తెలుపు రంగుల్లో మాత్రమే కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కార్ప్ జాతి చేప విలువ సుమారు 40 వేల బ్రిటన్ ఫౌండ్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు 36.50 లక్షలు) గా సమాచారం. మనిషి ముఖ పోలికలతో గల ఈ చేప వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.