మిషన్ భగీరథ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు శరాఘాతం వంటి వార్త ఇది. తెలంగాణా వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించిన నిర్మాణపు పనులపై ఇంటలిజెన్స్ విభాగం లోతైన విచారణ జరుపుతోంది. గత కొన్ని రోజులుగా అత్యంత రహస్యంగా ఇంటలిజెన్స్ విభాగపు అధికారులు మిషన్ భగీరథ పథకంపై లోతైన విచారణ జరుపుతుండడం గమనార్హం. అయితే ఈ విచారణకు ప్రభుత్వ పెద్దలే ఆదేశాలు జారీ చేసినట్లు తెలియడం మరో విశేషం.
తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇంటింటికీ తాగునీరు ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ వాగ్దానాలతోపాటు ప్రతిష్టాత్మక వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు ఈ పథకం విషయంలో అధికార పార్టీ నేతలు అత్యంత ధీమాగా విపక్షాలపై విమర్శనాస్త్రాలను కూడా సంధించాయి.
మరోవైపు విపక్ష పార్టీలు సైతం మిషన్ భగీరథ పథకం గురించి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అనూహ్య వరుస విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మిషన్ భగీరథ పనుల తీరుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇంటలిజెన్స్ విభాగాన్ని ప్రభుత్వమే ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఇంటలిజెన్స్ సిబ్బంది ప్రత్యేక టీమ్ లుగా గ్రామ స్థాయిలో రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. ఏయే గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగు నీరు అందుతోంది? ఇప్పటికీ నీరందని గ్రామాల్లో గల పరిస్థితులకు కారణాలేమిటి? నీరు పల్లమెరుగకుండా, మెరక దిశలో పైప్ లైన్ పనులు చేయడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? కొన్ని ప్రాంతాల్లో పాత ట్యాంకుల ద్వారానే ఇంకా నీటి సరఫరా ఎందుకు జరుగుతోంది? నిర్మాణాల్లో గల లోపాలేమిటి? వంటి తదితర అంశాల ప్రశ్నలను ప్రామాణికంగా చేసుకుని ఇంటలిజెన్స్ టీమ్ లు విచారణ జరుపుతున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఇంటలిజెన్స్ వర్గాలు పాలక పార్టీ పెద్దలకు, ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం సహజం. కానీ ఓ ప్రతిష్టాత్మక పథకం గురించి ప్రత్యేకంగా విచారణ జరపడమే ఇక్కడ గమనించాల్సిన అంశం. మిషన్ భగీరథ పథకం గురించి ఇంటలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా విచారణ జరుపుతున్న తీరే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభుత్వం ఆయా విభాగాన్ని ఇందుకు పురిగొల్పడం వెనుక గల కారణాలు ఏమిటన్నదే తెలియాల్సి ఉంది.