మేడారం జాతరలో నక్సలైట్లు తిరుగుతారా? తిరిగితే వాళ్లు ఏ రూపంలో వస్తారు? అడవుల్లో ధరించి తిరిగే ఆలీవ్ గ్రీన్ డ్రెస్సుల్లోనే వస్తారా? సివిల్ దుస్తుల్లోకి మారి సంచరిస్తుంటారా? మేడారం జాతరలో నక్సలైట్లు బాహాటంగా తిరిగితే బందోబస్తులో గల వేలాది మంది పోలీసులు వారిని గుర్తు పట్టరా మరి? అన్నల ఆచూకీని కనిపెట్టలేరా? ఇదే జరిగితే ఇరువర్గాల మధ్య కాల్పుల సంఘటనలు జరగవా? జాతరకు వచ్చే నక్సల్స్ షార్ట్ వెపన్స్ తో సాయుధులై ఉంటారా? నిరాయుధులుగానే వచ్చి వెడుతుంటారా? అయినా నక్సలైట్లు జాతరకు ఎందుకు వస్తారు? దేవుళ్లపై వారికి నమ్మకం ఉంటుందా? కమ్యూనిస్టులు, మార్స్కిస్టులు, లెనినిస్టులు నాస్తికులు అంటుంటారు కదా? వాళ్లు కూడా సమ్మక్క జాతరకు వస్తారా? ఇన్ని ప్రశ్నలు దేనికంటే..?
శతాబ్దాల చరిత్ర గల మేడారం జాతరకు వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన నక్సలైట్లు కూడా హాజరై, బాహాటంగానే సంచరిస్తుంటారనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అనేక జాతరల్లో ‘అన్నా.. నమస్తే, బాగున్నవా’ అంటూ గుర్తు పట్టని తరహాలో ఉండే వ్యక్తులు స్థానిక పాత్రికేయులను జాతరలో పలకరించిన సంఘటనలు కూడా లేకపోలేదు. అయితే వీళ్లను ఎక్కడో చూసినట్లుందే? అని ఆలోచించేలోపే పలకరించిన వ్యక్తులు అశేష భక్త జనంలో కనిపించకుండాపోయేవారు. ఏదేని ఇంటర్వ్యూలోనో, అడవుల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనో చూసిన నక్సల్స్ గా గుర్తుకు వచ్చేలోపే, కనిపించిన వ్యక్తి క్షణాల్లోనే జాతరలో మాయమైన ఘటనలు కూడా ఉండేవి. 1980, 1990 దశకాల్లో ఏటూరునాగారం అటవీ ప్రాంతాన్ని దండకారణ్యంగా ప్రకటించి తమ కార్యకలాపాలను నిర్వహించిన అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నక్సల్స్ మేడారం పరిసరాల్లోనే ఎక్కువగా సంచరిస్తుండేవారు.
ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ నుంచి ఏటూరునాగారం వరకు పీపుల్స్ వార్ దళాలు పనిచేస్తుండేవి. ఏటూరునాగారం ఏరియా దళనేతగా పనిచేసిన జీనుగు నరసింహారెడ్డి ‘జంపన్న’ పేరుతో పీపుల్స్ వార్ కార్యకలాపాలు నిర్వహిస్తుండేవారు. సమ్మక్క కుమారుడైన ‘జంపన్న’ పేరునే పార్టీలో తన పేరుగా మార్చుకున్న నరసింహారెడ్డి దశాబ్ధాలపాటు అజ్ఞాత నక్సల్ లీడర్ గా పనిచేసి ఈ మధ్యే పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. మేడారం అడవులను కేంద్రంగా చేసుకుని విప్లవ కార్యకలాపాలు నిర్వహించిన ప్రతిఘటన, ప్రజాప్రతిఘటన, జనశక్తి తదితర గ్రూపులకు చెందిన నక్సల్స్ జాతరకూ వచ్చి, వెడుతుంటారనేది పోలీసు నిఘా వర్గాలకు కూడా తెలుసు. ప్రస్తుతం తెలంగాణాలో నక్సల్ కార్యకలాపాలు కట్టడిలో ఉన్నాయే తప్ప, గతంలో మేడారం జాతర వస్తోందంటే భద్రతపై, ముఖ్యంగా వీవీఐపీల రక్షణ అంశంలో పోలీసులు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించేవారు. పోలీసు అప్రమత్తత నిరంతరమనే అంశం నిర్వివాదమైనా, పరిస్థితుల తీవ్రవతను బట్టి అలర్ట్ విధానంలో తేడా ఉంటుందున్నది కాదనలేని వాస్తవం.
ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క జాతరలో నక్సల్స్ సంచారంపై స్పష్టతనివ్వడం విశేషం. జనశక్తి సాయుధ దళానికి నాయకత్వం వహించిన మహిళా కమాండర్ సీతక్క విప్లవ జీవితంలో నర్సంపేట, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో సాయుధురాలై సంచరించేవారు. తాను అజ్ఞాత నక్సల్ గా ఉన్నపుడు జాతకు వస్తే తలకు ఆకుపచ్చని వస్త్రం కట్టుకుని, నెత్తిన బెల్లం బుట్టతో పోలీసుల మధ్య నుంచే వెళ్లి సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునేదాన్నని సీతక్క వెల్లడించారు. మేడారం సమ్మక్క తల్లి దీవెనలతో ప్రస్తుతం జనంలోనే ఉండి ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం దక్కిందని కూడా మాజీ నక్సల్ నేత, ప్రస్తుత ములుగు ఎమ్మెల్యే సీతక్క వివరించారు. జాతరలో నక్సల్స్ సంచారానికి సంబంధించిన అసలు సంగతి సీతక్క నోటి నుంచి ఇలా బహిర్గమైంది.
అయితే ప్రతి మేడారం జాతరకు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగానే వస్తుంటారు కదా? ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నక్సల్స్ కూడా జాతరకు వచ్చే ఉంటారా? అని సందేహిస్తే మాత్రం… రావచ్చు… రాకపోవచ్చు… వస్తే మాత్రం కోటిన్నర మంది భక్తుల సంఖ్యలో వాళ్లను గుర్తు పట్టడం సాధ్యమా? అదీ సంగతి.