కొందరి స్వామి భక్తికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్టారు. ఆర్టీసీ చేసినట్లు ప్రచారం జరిగిన ఓ ప్రతిపాదనకు ఆయన ‘నో’ చెప్పారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగిందని, అయితే ఈ ప్రయత్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు పట్టినట్లు అధికారిక ప్రకటన స్పష్టం చేసింది.
ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సీఎం స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి పి. రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కు నోట్ కూడా పంపారు. కార్గో బస్సులపై ముఖ్యమంత్రి ఫోటో వేయరాదని ఇందులో స్పష్టంగా ఆదేశించారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.