‘సలహాలు, సూచనలు నిర్మాణాత్మకంగా ఉండాలి. విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. వాటిని మేం తప్పకుండా స్వీకరిస్తుంటాం’ అని కదా అనేక సందర్భాల్లో పాలకులు సెలవిస్తుంటారు. పార్టీ ఏదైనా, పాలకులెవరైనా, అధికారంలో ఉన్నపుడు రూలింగ్ పార్టీ నేతలు చెప్పే మాటలు ఇవే. అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల సమయంలో, మాటల యుద్ధం ముదిరిన సందర్భాల్లో ‘నిర్మాణాత్మక, సద్విమర్శ’ అనే పదాలు పదే పదే వల్లిస్తుంటారు. అది రాజకీయపరమైన అంశం. దాని సంగతి కాసేపు వదిలేద్దాం. అసలు విషయంలోకి వద్దాం.
ప్రస్తుతం చైనా ‘కరోనా’ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే కదా? అనేక దేశాలు అతలాకుతలాం అవుతున్నాయ్ కూడా. అందుకే హైదరాబాద్ లోని ఓ స్వచ్ఛంద సంస్థ తెలంగాణా పోలీసులకు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులకు ఓ విశేషమైన, నిర్మాణాత్మక సలహాను ఇచ్చిందండోయ్. ఈమేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు సంస్థ ఫౌండర్ ఓ లేఖ కూడా రాశారు. అందులో సదరు ఫౌండర్ ఏం కోరుతున్నారో తెలుసా?
‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. ప్రస్తుత ‘కరోనా’ వైరస్ పరిస్థితుల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహణలో అపరిశుభ్ర పరికరాల కారణంగా ఇది మరింత విస్తరించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉందని, అందువల్ల తాత్కాలికంగా డ్రంకెన్ డ్రైవ్ నిర్వహణ నిలిపివేయడమే శ్రేయస్కరమని కమిషనర్ కు రాసిన లేఖలో ఆయన సూచించారు. ఇంతకీ ఈ ‘సలహా-కమ్-కోరిక’ను నిర్మాణాత్మకమైన సూచన కింద పరిగణించవచ్చా? డ్రంకెన్ డ్రైవ్ నుంచి మందు బాబులకు రిలీఫ్ గా భావించాలా? ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఆరోగ్యకరమైన సలహాగా స్వీకరించాలా? అని హైదరాబాద్ పోలీసులు తర్జన భర్జనలో పడ్డారుట. అదీ విషయం.