అది…కరీంనగర్ నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) కార్యాలయం.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు కొందరు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అందులో ఓ యువకుడికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సీన్ లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు. ఓ పోలీసు అధికారి తన గళం విప్పారు. ఆయా యువకున్ని ఉద్దేశించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
‘సిటిజన్ షిప్ చట్టం ఏం చెప్పింది? ఏం చదువుకున్నావ్? సెక్యులర్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? 1947లో దేశ విభజన జరిగినప్పుడు ఏం జరిగింది? విభజనను భారత దేశం కోరుకోలేదు తెలుసా? మనుషులం మనం… ఏం జరుగుతోందో తెలుసా? ఎన్నార్సీ పెట్టింది ఎవరి కోసమో తెలుసా? ధర్మం మాట్లాడాలె కదా? అమెరికా వాడు అందరినీ దేశంలోకి రానిస్తున్నాడా? మనం భారతదేశం పౌరులం. ఈ భూమి మనది. జాతి మనది. పొలిటికల్ గేమ్స్. పార్లమెంట్, అసెంబ్లీలో గతంలో చేసిన ప్రసంగాలకు విరుద్ధంగా ప్రస్తుతం కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు (కొందరు నేతల పేర్ల ప్రస్తావన). వాళ్ల స్వార్ధ ప్రయోజనాలు ఇందులో దాగి ఉన్నాయి. చైనాలో బీజింగ్ సెంటర్లో 10 లక్షల మందిని ట్యాంకర్స్ పెట్టి కొట్టిండ్లు. మనదేశంలో అలా లేదు కదా? స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు పుష్కలం. ఆలోచించండి. విద్వేషాలను రెచ్చగొట్టవద్దు. సహకరించండి. విషయం మాకు చెప్పండి. మనది ప్రజాస్వామ్య దేశం.’’ అంటూ దాదాపు 20 నిమిషాలపాటు సదరు పోలీసు అధికారి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంకా అనేక అంశాలపై తనకు గల పట్టును ప్రస్ఫుటింపజేస్తూ అనర్గళంగా ప్రసంగించారు. ఇందుకు సదరు యువకుడు కూడా ‘కరెక్టే సర్…’ అంటూ అంగీకరించాడు కూడా.
కానీ ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే పోలీసు అధికారులకు కాస్త అనుమానం కలిగింది. అసలే రోజులు బాగోలేవు కదా? అందుకే కాబోలు ‘సెల్ బంద్ జేసినవా? స్విచ్ ఆఫ్ చేసినవా?’ అంటూ కౌన్సింగ్ కు హాజరైన యువకుడిని ప్రశ్నించారు. అతని వద్ద గల మొబైల్ ఫోన్ ను తీసుకుని పక్కన పెట్టారు కూడా. కౌన్సెలింగ్ పూర్తయింది. యువకుడు వెళ్లిపోయాడు. పోలీసు అధికారులు కూడా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ కౌన్సెలింగ్ చేసిన సమయంలో దాదాపు 20 నిమిషాల నిడివి గల ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరీంనగర్ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమ కౌన్సెలింగ్ ‘తీరు’ను ఎలా వీడియో తీయగలిగారనే అంశం అంతుబట్టక తలలు నిమురుకున్నారుట. ఎందుకంటే ఆయా వీడియోలో కౌన్సెలింగ్ సందర్భంగా చేసిన ‘పోలీసు’ తరహా వ్యాఖ్యలు కూడా కొన్ని ఉన్నాయి. అదీ కంగారు పడే అసలు అంశం.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కౌన్సెలింగ్ సందర్భంగా వీడియో చిత్రీకరణ ఎలా సాధ్యమైంది? అనే అంశంపై ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి విచారణ జరపడంతో అసలు విషయం బహిర్గతమైంది. కౌన్సెలింగ్ చేసిన యువకుడి చేతికి గల రిస్ట్ వాచ్ ద్వారా కౌన్సెలింగ్ ను వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందట. సదరు యువకుడు తన రిస్ట్ వాచ్ ద్వారా చిత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో అతనే పోస్ట్ చేసినట్లు కూడా పోలీసులు కనుగొన్నారు. కౌన్సెలింగ్ సందర్భంగా ఎంతో ‘వినయం’గా జవాబులు చెప్పిన సదరు యువకుడు మరీ ఇంత ‘కన్నింగ్’ గా వీడియో తీస్తాడని ఊహించని కరీంనగర్ పోలీసులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదట. అదీ సంగతి.