మాఘ శుద్ధ పౌర్ణమి దగ్గరకు రానే వచ్చింది. దీన్నే సమ్మక్క పున్నమి అని కూడా భక్తులు వ్యవహరిస్తుంటారు. ఏమిటీ ఈ పున్నమి విశేషం అంటే… మేడారం జాతర సంబురం. వనదేవతలకు మొక్కులు చెల్లించే కొండంత పండుగ. కోటాను కోట్ల భక్తుల విశ్వాసం. అధికారిక లెక్కలే దాదాపు కోటిన్నర మంది భక్తులు. ప్రతి జాతరకు పెరుగుతున్న భక్తుల విశ్వాసం. జాతరకు ముందుగానే లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాలు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం జాతరకు మూడు రోజుల్లోనే తరలివచ్చే కోటిన్నర మంది భక్తుల మధ్య వన దేవతలను దర్శనం చేసుకోవడం కష్టమవుతుందనే భావనతో ముందస్తుగా చెల్లిస్తున్న మొక్కులు.
కానీ సమ్మక్క పున్నమి మొదలైందే తడవుగా… అంటే గత పాడ్యమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు గల పక్షం రోజుల వ్యవధిని భక్తులు అలా వ్యవహరిస్తారు. జాతరకు వెళ్లే భక్తులు ముందుగా తమ తమ ఇళ్లల్లో వన దేవతలను కొలుస్తారు. ఇంట్లో సమ్మక్క-సారలమ్మ ఫొటోలను శుభ్రం చేసి పూజలు చేస్తారు. తల్లికి, పిల్లకు (సమ్కక్క-సారలమ్మ)లకు ‘బంగారం’గా వ్యవహరించే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. తమ ఆర్థిక శక్తిని బట్టి కోడి గుడ్డు నుంచి కోడి, మేక వరకు కోసుకుని పూజలు నిర్వహిస్తారు. జాతరకు వెళ్లడానికి ముందు జరిగే ఇటువంటి పున్నమి పూజ సమ్మక్క భక్తులకు చెందిన ప్రతి ఇంట్లో ఆనవాయితీ. జాతరలో చెల్లించే మొక్కులు సరేసరి. జాతర నుంచి తిరిగి వచ్చాక వారంలోపు మళ్లీ వన దేవతలకు ఇంట్లో మొదటి ప్రక్రియ తరహాలో మళ్లీ పూజలు చేస్తారు. పక్షం రోజుల వ్యవధిలో ఇంట్లో రెండు సార్లు, జాతరలో ఓసారి వనదేవతలను ఆరాధించి, నైవేద్యాలు సమర్పించి, ఎత్తు బంగారం మొక్కులుగా చెల్లించడమే మేడారం జాతరలో భక్తుల విశ్వాసానికి సంబంధించిన విశిష్టత. ఇందులోని అసలు విశేషం ఏమిటంటే ఈ మూడు సందర్భాల్లోనూ జరిపే పూజలు, చెల్లించే మొక్కులు వనదేవతలకు ప్రీతి, పాత్రమైన బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహించడం.