చైనా.. కరోనా వైరస్.. చావు.. పుట్టుక వగైరా ఆందోళనను వదిలేయండి. భయాన్ని పక్కన బెట్టండి. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగానే సందడిగా మారిన మేడారం అడవుల్లోని జాతరకు సంబంధించిన ప్రత్యేక విషయాల గురించి కూడా చెప్పుకుందాం. నమ్మకం, మూఢ నమ్మకం, భక్తి, విశ్వాసం, ఆస్తికత్వం, నాస్తికత్వం ఎవరి ఇష్టం వారిది. కానీ మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలకు ఎంతో ప్రీతి పాత్రమైన ‘ఎత్తు బంగారం’ మొక్కులో శాస్త్రీయ అంశాలు దాగి ఉండడమే అసలు విశేషం.
తమ కోర్కెలు తీరిన భక్తులు వన దేవతలకు మొక్కుల చెల్లింపులో భాగంగా బంగారంగా పిల్చుకునే బెల్లాన్ని తమ ఎత్తు బరువుకు సమానంగా తూకం వేసి చెల్లిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. తాము మొక్కుగా చెల్లించిన బంగారాన్ని (బెల్లం) జాతర నుంచి ఇళ్లకు చేరుకున్నాక చుట్టుపక్కల వారికి, బంధువులకు పంపిణీ చేస్తుంటారు. మిగిలిన బంగారాన్ని ఇంటి అవసరాలకు వినియోగిస్తుంటారు.
కానీ ఈ బంగారపు మొక్కులోని బెల్లంలో అనేక సైంటిఫిక్ అంశాలు దాగి ఉండడం గమనార్హం. ప్రస్తుతం మేడారం వెళ్లడానికి అనేక రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. వేలాది ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రయివేట్ వాహనాల్లో సులభంగా వెళ్లి, రావడానికి రవాణా సదుపాయలు కూడా మెరుగుపడ్డాయి. కానీ ఒకప్పుడు మేడారం జాతర అంటే ఎడ్ల బండ్ల సంఖ్యను లెక్కించడం గగనంగా ఉండేది. మారిన అనేక పరిణామాల్లో ఎడ్ల బండ్లు అక్కడక్కడ, అత్యంత స్వల్ప సంఖ్యలో మాత్రమే కనిపిస్తుండగా, ట్రాక్టర్లు, టాటా ఏస్ వంటి ఇతర వాహనాలకు డేరాలు బిగించి బండ్ల మాదిరిగానే భక్తులు అలంకరించి రవాణాకు ఉపయోగిస్తున్నారు. రోడ్లు, రవాణా సదుపాయాలు ఇంతగా అభివృద్ది చెందక ముందు మేడారం వెళ్లిన భక్తులు ఎవరైనా సరే ‘కలర్’ మారేవారు. ఎవరి శరీర రంగు ఎలా ఉన్నప్పటికీ, ఎర్రని దుమ్ముతోనే భక్తులు కనిపించేవారు. కొన్ని సందర్భాల్లో మనుషులను గుర్తు పట్టడం కూడా కష్టంగానే ఉండేది.
ఇదిగో ఇటువంటి దుమ్ము, ధూళి నుంచి రక్షించే ఔషధమే బెల్లం అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జాతరకు వెళ్లిన భక్తులు బెల్లాన్ని తింటే అనేక అలర్జీల నుంచి బయటపడతారని, ఇది బెల్లానికి గల సహజ ఔషధ గుణమని వారు చెబుతున్నారు. బెల్లంలో ఐరన్ ఉంటుందనేకి కూడా అందరికీ తెలిసిన అంశమే. అంతేకాదు మలబద్దకానికి, ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులకు కూడా బెల్లం ఉపశమనాన్ని కలిగిస్తుంది. భోజనానంతరం ఓ చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలి మింగితే ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. శ్వాసకోశ రుగ్మతలు గలవారికి ఈ బెల్లం మరింత ఉపకరిస్తుంది కూడా. బెల్లంలో యాంటీ అలర్జీ గుణాలు ఉండడమే ఇందుకు కారణమని, శ్వాస, దగ్గు వంటి ఇబ్బందులను బెల్లం దూరంగా ఉంచుతుందని డాక్టర్లు సైతం వెల్లడిస్తున్నారు.
అంటే… సమ్మక్క తల్లి ఎత్తు బంగారం మొక్కులోని బెల్లంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అనేక విశిష్టతలు కూడా ఉన్నాయన్నమాట. మొక్కులు తీర్చుకున్న భక్తులు పది మందికీ బంగారాన్ని (బెల్లం) ప్రసాదంగా పంచిపెట్టడం వెనుక అందరి ఆరోగ్యాన్ని కోరుకునే సుగుణం దాగి ఉందన్న మాట. తనకు బంగారాన్ని (బెల్లం) మాత్రమే మొక్కులుగా చెలించాలని సమ్మక్క తల్లి కోరుకున్నట్లు గల చరిత్ర వెనుక భక్తుల ఆరోగ్యం కూడా దాగి ఉందనేది కాదనలేని వాస్తవం. ఇది భక్తుల విశ్వాసం కూడా. ఇదీ ‘ఎత్తు బంగారం’లోని శాస్త్రీయతలో గల అర్థం…పరమార్థం.