తెలంగాణాలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల రాజకీయ ముఖచిత్రంలో ఓ దృశ్య పరిణామం పెద్దగా చర్చల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధికార పార్టీ నేతలను వణికించడమేకాదు, ముచ్చెమటలు పట్టించి, ఏకంగా ఓటమి బాటన పయనింపజేయడమే అసలు విశేషం. ఎటువంటి రాజకీయ హంగూ, ఆర్భాటం.., మందీ, మార్బలం లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు బాటన పయనించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన కొన్ని పెద్ద పార్టీలకు సైతం లభించని గుర్తింపు, ఆదరణ ఈ పార్టీకి దక్కడమే మున్సిపల్ ఎన్నికల రాజకీయ ప్రత్యేకతగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
ఇంతకీ ఆ పార్టీ పేరేమిటో తెలుసా? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఔను 1939లో పుట్టిన ఈ పార్టీ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్. పూర్తి రాజకీయ పార్టీగా 1940లో మారిన నేతాజీ పార్టీ ఎన్నికల గుర్తు ‘సింహం’. ప్రస్తుతం తెలంగాణాలో ఈ సింహం గుర్తుపై గెల్చిన ప్రజాప్రతినిధులు మొత్తం ఎంత మందో తెలుసా? దాదాపు 82 మంది. ఇందులో ఓ ఎమ్మెల్యే, ఇద్దరు జెడ్పీటీసీలు, 25 మంది ఎంపీటీసీలు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ‘సింహ’నాదం చేసిన పురపాలక ప్రజాప్రతినిధుల సంఖ్య అక్షరాలా 54 మంది. ఇందులో 12 మంది నగరపాలక సంస్థల్లోని కార్పొరేటర్లు కాగా, పుర పాలక సంఘాల్లో 42 మంది మున్సిపల్ కౌన్సిలర్లు.
ప్రస్తుతం తెలంగాణా సీఎం కేసీఆర్ పార్టీకి జై కొడుతున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన ‘సింహం’ గుర్తుపైనే విజయం సాధించడం గమనార్హం. 2014 ఎన్నికల్లోనూ చందర్ ఇదే పార్టీ గుర్తుపై పోటీ చేసి కేవలం 1,300 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కానీ గత ఎన్నికల్లో మళ్లీ ‘సింహం’ గుర్తు పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన అభ్యర్థుల్లో ఇద్దరు జెడ్పీటీసీలుగా, 25 మంది ఎంపీటీసీలుగా విజయం సాధించారు.
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో 160 మంది అభ్యర్థులకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్లు ఇవ్వగా, అందులో 54 మంది కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా గెలుపొందారు. ప్రాంతాల వారీగా రామగుండంలో 9 మంది, కరీంనగర్ లో ముగ్గురు, పెద్దపల్లి, ఆలంపూర్, దుబ్బాక, జగిత్యాలల్లో ఒక్కొక్కరు, ఐజలో 10 మంది, కొల్లాపూర్ లో 11 మంది, శంషాబాద్ లో మంది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.
అధికార పార్టీ తరపున అభ్యర్థిత్వం దక్కని అనేక మంది ఆశావహులు ప్రత్యామ్నాయంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఆశ్రయిస్తుండడం గమనార్హం. కొల్లాపూర్ మున్సిపాల్టీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ టికెట్లు దక్కని తన అనుచరగణాన్ని ఎన్నికల గోదాలోకి దింపేందుకు ‘సింహం’ గుర్తు పార్టీనే ఆశ్రయించడం విశేషం. అయితే పార్టీ రెబల్స్ గా భావించిన ఈ కౌన్సిలర్లను తిరిగి టీఆర్ఎస్ గూటికి చేర్చేందుకు మాజీ మంత్రి జూపల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూపల్లికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి.
సరే…ఈ విషయంలో అధికార పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, ఎన్నిక ఏదైనా టికెట్ దక్కని నేతలు మాత్రం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఆశ్రయించి బీ ఫారాలు తెచ్చుకుంటున్న తీరు తెలంగాణాలో సరికొత్త రాజకీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగానే పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే అంశంపై ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి ts29.inతో మాట్లాడుతూ, తమది జాతీయ పార్టీ అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీగా చెప్పారు. నేతాజీ అశయాలకు అనుగుణంగానే పార్టీని నడపించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే తమ వద్ద ప్రస్తుత రాజకీయ అవసరాలకు, మారిన పరిణామాలకు అనుగుణంగా డబ్బూ, దస్కం లేదని, అయినప్పటికీ ‘సింహం’ గుర్తును ప్రజలు ఆదరిస్తున్నారనే విషయం తాజా మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైందన్నారు. ఈ ఎన్నికల్లో తాము టికెట్లు ఇచ్చిన ఇంకా అనేక మంది స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారని, మరికొందరు ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. రామగుండం మున్సిపాల్టీలో తమ పార్టీ 21 శాతం ఓట్లను సంపాదించిందని, అక్కడి ఎమ్మెల్యే సాంకేతికంగా తమ పార్టీకి చెందినవారేనని సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఎన్నికల్లో పోరాడిన తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారన్నారు. నేతాజీ ఆశయాలకు అనుగుణంగా పార్టీని నడిపించాలన్నదే తమ ధ్యేయమని సురేందర్ రెడ్డి వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లే చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించామన్నారు.