‘కరోనా వైరస్‌ను గుర్తిచేందుకు అవసరమయ్యే పరికరాలు మన దగ్గర లేవు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపాం. పరీక్షల కోసం ప్రతిసారి పుణెకు నమూనాలు పంపడం వల్ల కాలయాపన జరుగుతోంది. ప్రజలు కూడా వైరస్ ప్రభావిత లక్షణాలు ఉన్నప్పుడు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని కోరుతున్నా. కొంతమంది సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వదంతులు పోస్టు చేసి ప్రజలను అయోమయానికి గురి చేయవద్దు’ అని తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు.
తెలంగాణలో కరోనా వైరస్ కేసు ఒక్కటి కూడా లేదని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందనే వదంతులను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. బుధవారం ఉదయం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్‌కు వ్యాప్తి చెందకుండా చేపట్టిన ముందస్తు చర్యలపై మంత్రి ఈటల ఈ సమావేశంలో సమీక్షించారు.
అనంతరం విలేకరులతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్లు నిర్థారణ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరిన ఐదుగురు కేవలం కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న వారుగా మాత్రమే భావిస్తున్నారని చెప్పారు. ఈ భయంకర వైరస్ వ్యాప్తి చెందకుండా ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటూ పర్యవేక్షణ చేస్తోందన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల భరోసా ఇచ్చారు.
‘గత నెల రోజులుగా కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. కానీ మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణలో ఒక్క రోగి కూడా కరోనా వ్యాధితో లేరు. ప్రజల్లో కాస్త ఆందోళన ఎక్కువగా ఉంది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించి, అలాంటి లక్షణాలు ఉంటే విమానాశ్రయల్లో ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రిల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశాం. మంచి వసతులు కల్పిస్తున్నాం. ఆసుపత్రుల్లో ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశాం. గాంధీ ఆసుపత్రిలో వసతులు బాగున్నాయి…ఫీవర్ ఆసుపత్రిలో వసతులను గురువారంలోగా మెరుగు పరుస్తాం.’ అని ఈటల వివరించారు.