రేవు దాటేదాక ఓడ మల్లయ్య… ఆ తర్వాత బోడ మల్లయ్య అన్నది సామెత కదా? ఇదిగో ఈ అభ్యర్థిని చూడండి సామెతకు సూటయ్యే విధంగా ఓటర్లను ఉద్దేశించి ఎలా నిందిస్తున్నాడో. ఇతని పేరు బండి శ్రీనివాస్. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 14వ డివిజన్ కార్పొరేటర్ పదవి కోసం పోటీ పడ్డారు. ఎన్నికలకు ముందు ఓట్లు అడిగే సమయంలో ‘నేను డివిజన్ ను అభివృద్ధి చేయకపోతే నన్ను చెప్పుతో కొట్టండి’ అన్నారు. కానీ అక్కడి ప్రజలు ఎందుకోగాని ఇతన్ని గెలిపించలేదు. ఆరంటే ఆరు ఓట్లు మాత్రమే ఇతనికి వచ్చాయి. తన ఓటు మినహాయిస్తే ఇక అయిదుగురు మాత్రమే అతనికి ఓటు వేశారు.
అందుకే శ్రీనివాస్ ఇప్పుడు ‘చెప్పు’కుంటున్న బాధ ఏమిటో తెలుసా? డివిజన్ ఓటర్లు ఓటును నోటుకు అమ్ముకున్నారన్నది శ్రీనివాస్ ఆరోపణ. ‘తమ ఓటును నోటుకు అమ్ముకున్న త్యాగమూర్తులకు నా హదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరందరూ ఎప్పుడూ ఇలాగే, మీరు కోరుకున్న అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాను’ అని సూక్తీకరించారు. ఈమేరకు ఎన్నికలకు ముందు, ఫలితాల తర్వాత ఇదిగో ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఈ శ్రీనివాస్ ఎవరో మీరు సరిగ్గా గుర్తించినట్లు లేదు. తెలంగాణా రాష్ట్ర భార్యా బాధితుల సంఘానికి అధ్యక్షుడు. ఔను.. అతనే ఈ శ్రీనివాస్.