పీవీ సింధు… బ్యాడ్మింటన్ క్వీన్. ఒలింపిక్ పతక విజేత. హైదరాబాద్ గచ్చిబౌలీలోని పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ పొందారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ప్లేయర్స్. అర్జున అవార్డు గ్రహీతలు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సింధు బ్యాడ్మింటన్ లో రాణిస్తూ వస్తోంది. సింధు తల్లి విజయవాడకు చెందినవారు. అయితే… తండ్రి పీవీ రమణ బాల్యమంతా విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లో గడిచినా నిర్మల్ వాసి అని చెబుతుంటారు.
సరే…వారెక్కడివారైనప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. ఇందులోనూ ఏ డౌటూ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2016లో జరిగిన రియో (బ్రెజిల్) ఒలింపిక్స్ లో సింధు రజత పతకం సాధించారు. దీంతో తెలంగాణా సీఎం కేసీఆర్, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరూ… ఒకరు రూ. 1.00 కోట్లు, మరొకరు రూ. 3.00 కోట్లు అని వేలం పాటలో పోటీ పడిన చందంగా సింధుకు నగదు నజరానాలు ప్రకటించారు. మంచిదే.. ఎల్లలు లేకుండా దేశవ్యాప్తంగా సింధుకు నజరాలు కూడా లభించడం సంతోషకర పరిణామం కూడా. అయితే అప్పట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాను గోపీచంద్ కు స్థలం ఇవ్వడం వల్లే భారతదేశానికి ఒలింపిక్ పతకం వచ్చిందని నిర్వచించారు. అక్కడితోనే ఆగకుండా తానే సింధుకు బ్యాడ్మింటన్ నేర్పించాననే భావన స్ఫురించేలా, అర్థం ధ్వనించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల సందర్భాలు కూడా లేకపోలేదు. సరే హైదరాబాద్ నగరాన్ని కూడా తానే కట్టానని చంద్రబాబు చెబుతుంటారు.. అది వేరే విషయం.
విజయవాడలో జరిగిన పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఓ దశలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఒలింపిక్స్ లో పతకం సాధిస్తే ఏకంగా నోబెల్ బహుమతి ఇస్తానని చంద్రబాబు ప్రకటించడమే ఇందుకు కారణం. అక్కడితోనే ఆగకుండా చంద్రబాబు సింధుకు డెప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ప్రకటిస్తూ, పోస్టింగ్ కూడా ఇచ్చారు. అనంతర పరిణామాల్లో డెప్యూటీ కలెక్టర్ గా సింధు విధుల్లో కూడా చేరారు. టోక్యోలో ఒలిపింక్స్ ఉన్నాయని, ప్రాక్టీస్ కోసం ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటీవలే ప్రత్యేక సెలవు కూడా మంజూరు చేయించుకున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డులో పీవీ సింధు తెలంగాణా రాష్ట్రానికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ గా ఉటంకించడం గమనార్హం. ఇదిగో ఇక్కడే అసలు చిక్కు వచ్చిందనేది క్రీడాకార వర్గాల అభిప్రాయం. మున్ముందు సింధు సాధించే పతకాలు, అవార్డులు తెలంగాణా రాష్ట్ర ఖాతాలో వేసుకోవాలా? ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో రాసుకోవాలా? పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆయా శాఖలు, ప్రభుత్వాలు కూడా సిఫారసు కూడా చేస్తాయి. అవార్డుల ప్రక్రియలో ఇదో భాగం. ఈ విషయంలో ప్రస్తుతం ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింధు సిఫారసు చేయించుకున్నారు? ఇంతకీ పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా? తెలంగాణా బిడ్డా? తేల్చాల్సిందేనని సోషల్ మీడియాలో ప్రశ్నలతో కూడిన ఒకటే పోస్టుల గోల. అధికారులు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్. మన తెలుగు పీవీ సింధుకు పద్మభూషణ్ పురస్కారం లభించిందనే సంతోషం కన్నా, ఇటువంటి ప్రశ్నలే మిన్నగా వివాదాస్పద సందేహాలు. అదీ సంగతి.
-అక్షర ఆటగాడు