‘‘గోదావరి తల్లినే సిరిసిల్లకు తెస్తే.. మీ కాళ్లకు జలాభిషేకం చేస్తే.. ఇంకో పార్టీకి సిరిసిల్ల గడ్డ మీద ఓటు వేద్దామా..? ఎయ్యొద్దు. ఇండిపెండెంట్లు కొంత మంది తిరుగుతాండ్లు..నేను జూసిన.. ఏమంటుండ్లు..కొంత మంది అన్నల్ దమ్మండ్లు ఏమంటుండ్లు? అన్నా…నేను గూడ గెల్చి కేటీఆర్ అన్న దగ్గరికే బోతనే…నేను గూడ ఆయన తమ్మున్నే అంటుండ్లు. నాతోని ఉన్నోడు ఎలక్షన్ల నావోడు గాని, నాకు ఖిలాఫ్ పోటీ జేసెటోడు నావోడు ఎట్లయితడు? నాకర్థం గాక అడుగుత? తెల్లారి లేసి కారు గుర్తునే ఓడగొట్టమని చెప్తే.. నాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు గాదా? నేను మీకు దండం బెట్టి జెప్తున్న…’’
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో చేసిన ఓ ప్రసంగంలోని ముఖ్య వ్యాఖ్యలివి.
కాసేపు ఆ వ్యాఖ్యలను పక్కన బెట్టండి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లోని ఏకైక మున్సిపాలిటీ… తన నియోజకవర్గ కేంద్రం మాత్రమే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల రెండు మున్సిపాలిటీల్లో నియోజకవర్గ కేంద్రాన్ని మినహాయిస్తే, మరొకటి వేములవాడ పురపాలక సంఘం మాత్రమే.
సిరిసిల్ల మున్సిపాలిటీల్లో గల 39 వార్డుల్లో ఎన్నికలకు ముందే నాలుగు వార్డుల్లో అధికార పార్టీకి చెందిన వారు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎన్నికలు జరిగింది కేవలం 35 వార్డులకు మాత్రమే. అందులో 18 వార్డుల్లో టీఆర్ఎస్, 12 వార్డుల్లో ఇండిపెండెంట్లు, మూడింట బీజేపీ, రెండింట కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవంగా గెల్చుకున్న నాలుగు వార్డులను కలుపుకుంటే సిరిసిల్ల పురపాలక సంఘంపై గులాబీ జెండా ఎగిరినట్లే. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు కూడా అక్కర లేకుండా విజయం సాధించినట్లే.
కానీ కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం ఖిలాఫ్ గా చేసిన వారిలో 12 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. వాస్తవానికి వీళ్లంతా కూడా అధికార పార్టీకి చెందినవారే. టికెట్ రాలేదని అలిగి రెబల్స్ గా బరిలోకి దిగి.. కొట్లాడి.. గెల్చిండ్లు. వీళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని, పార్టీకి ద్రోహం చేసినవారిని పక్కన పెట్టాలని, ఒకవేళ తీసుకుంటే తాము మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామనే సందేశంతో సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తల పేరున పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఖిలాఫ్ చేసి గెల్చిన 12 మంది కౌన్సిలర్లను కేటీఆర్ పార్టీలోకి తిరిగి తీసుకుంటారా? లేదా? అన్నది కూడా కాసేపు వదిలేయండి.
ఇంతకీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెల్చినట్లా? ఓడినట్లా? ఏకగ్రీవంగా చేజిక్కించుకున్న నలుగురు కౌన్సిలర్లను మినహాయించి విశ్లేషించండి. ఇక్కడి ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలను సైతం విస్మరించి లోతుగా విశ్లేషించండి. అల..సిరిసిల్ల ‘రామన్న’ రాజ్యంలో ఇదీ మున్సిపల్ ఫలితాల విశేషం.