కనీసం ‘నోటా’ కైనా ఎన్నో కొన్ని ఓట్లు వచ్చాయిగాని, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా లభించకపోవడం అత్యంత విచిత్రమైన విశేషం కదూ. శనివారం ఓట్ల లెక్కింపు జరుగుతున్న తెలంగాణా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేకత ఇది. ఫలితాల వివరాలు చూసి పోటీ చేసిన అభ్యర్థులే కాదు, ఎన్నికల అధికార యంత్రాంగం, సిబ్బంది సైతం అవాక్కయ్యారు. వివరాల్లోకి వెడితే..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి పోటీ చేసిన ఈసరవెల్లి నాగరాణికి ఒక్క ఓటు కూడా పడలేదు. ఈమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మంథనిలో 8వ వార్డు నుంచి కౌన్సిలర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త పద్మ సైతం ఒక్క ఓటునూ ప్రజల నుంచి పొందలేకపోయారు.
ఇదే మున్సిపాలిటీలోని 4వ వార్డు నుంచి పోటీ చేసిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కేతిరి రాజయ్య పరిస్థితి కూడా ఇదే. ఆయా వార్డుల్లో ‘నోటా’కు అయిదు, రెండు చొప్పన ఓట్లు లభించడం మరో విశేషం. అటు వేములవాడలో, ఇటు మంథనిలో చోటు చేసుకున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల విశేషాల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఓటు తాము కూడా వేసుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. ‘తాళం వేసి గొళ్లెం మరచిన’ చందంగా ఆయా అభ్యర్థులు ‘ఎన్నికల్లో పోటీ చేసిరి..కానీ ఓటు వేసుకోవడం మరిచితిరి’ అదన్న మాట…అసలు సంగతి.