ఛత్తీస్ గఢ్ పేరు వినగానే ఏం గుర్తుకు వస్తుంది? బస్తర్ అడవులు, మావోయిస్టు నక్సలైట్లు, వారి ఏరివేతకు దిగిన వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇరువర్గాల మధ్య జరిగే భీకర పోరు. రక్తమోడిన దండకారణ్యం. భారీ ఎన్కౌంటర్. ఫలానా సంఖ్యలో నక్సలైట్ల మృతి. పేట్రేగిన మావోలు…మందుపాతర పేలి ఫలానా సంఖ్యలో పోలీస్ జవాన్ల మృతి. వంటి వార్తలే ఎక్కువగా ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో కనిపిస్తాయి. చూస్తుంటాం. చదువుతుంటాం కూడా. ఛత్తీస్ గఢ్ అడవుల్లో తమకు నిర్దేశించిన విధుల నిర్వహణలో చోటు చేసుకునే కొన్ని ఘటనల్లో మానవ హక్కులను హరిస్తున్న పోలీసులు అనే విమర్శలను కూడా వింటుంటాం.
దశాబ్ధాలుగా అటువంటి వాతావరణపు వార్తలు మాత్రమే చదువుతున్న పరిణామాల్లో ఇది మానవత్వాన్ని ప్రతిబింబించే ఘటన. తుపాకీ చేతబట్టుకుని నక్సలైట్ల కోసం నిత్య గాలింపు జరిపే సీఆర్పీఎఫ్ భద్రాతా బలగాలు నిజమైన మానవత్వాన్ని చాటుకున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణీ స్త్రీని భద్రతా బలగాలు తమ భుజస్కంధాలపై మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఆమె ప్రాణాన్ని రక్షించడం విశేషం.
పదేడ్ గ్రామానికి చెందిన బుద్ది హప్కా అనే గర్భిణీకి నెలలు నిండి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కానీ ఆసుపత్రికి వెళ్లడానికి ఎటువంటి అంబులెన్స్ వంటి వాహన, రవాణా సౌకర్యాలు లేవు. నక్సల్ గాలింపు చర్యలో భాగంగా పదేడ్ గ్రామానికి వెళ్లిన సీఆర్ప్ఎఫ్ భద్రతా బలగాల దృష్టికి గ్రామస్తులు విషయాన్ని తీసుకువెళ్లారు. ఆ గర్భిణీ ప్రాణాన్ని తమ బాధ్యతగా భావించిన పోలీసులు మంచంతో ఏర్పాటు చేసిన ‘జెడ్డీ’పై ఆమెను ఆరు కిలోమీటర్ల దూరం వరకు తమ భుజాల మీద మోసుకుంటూ వెళ్లి చేర్పాల్ ఆసుపత్రిలో చేర్చించారు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన జాతీయ స్థాయిలో వార్తగా నిలిచింది. కీకారణ్యంలో ఓ గర్భిణీ ప్రసవ వేదనను మానవత్వంతో తమ భుజాన మోసిన సీఆర్పీఎఫ్ పోలీసులు హృదయపూర్వక అభినందనీయులే.