రాబోయే విద్యా సంవత్సరానికి తమ విద్యా సంస్థల్లో ప్రవేశానికై కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థలు ఇప్పటినుంచే తమ మెదడుకు పదును పెట్టాయి. నిన్న వివిధ దినపత్రికల్లో ప్రజలను గందరగోళ పరిచే వ్యాపార ప్రకటనలతో ఈ ప్రక్రియను ప్రారంభించడం గమనార్హం.
దేశంలోని వివిధ ఎన్ఐటీ లలో ఇంజనీరింగ్ విద్యకై ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. మొదటి సారి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈనెల 18వ తేదీన విడుదల చేయగా, ప్రభుత్వాలను శాసిస్తున్నట్లు ప్రాచుర్యంలో గల రెండు కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థలు 19న ఎప్పటి మాదిరిగానే ప్రజలను ఆకర్షించడానికి, గందరగోళ పరిచే ప్రకటనలను ఇవ్వడం విశేషం.
గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ప్రతి సబ్జెక్టులోనూ అన్ని ప్రశ్నలకు సరియైన సమాధానాలను గుర్తించిన వారికి మాత్రమే 100 పర్సెంటైల్ వస్తుంది. ఇలా వంద పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా 9 మంది మాత్రమే ఉన్నారు. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలను శాసిస్తున్న రెండు కార్పొరేట్ విద్యా సంస్థల వారు ప్రజలను ఆకర్షించడానికి గందరగోళ పరిచే విధంగా ప్రకటనలను ఇచ్చాయి.
ఒక్కొక్క కళాశాల వారు 32 మంది విద్యార్థులు ? పర్సెంటైల్ సాధించినట్లుగా 32 మంది విద్యార్థుల ఫోటోలు, పేర్లను తమ ప్రకటనల్లో ఇచ్చారు. NTA ప్రకటించిన ఫలితాలలో దేశ వ్యాప్తంగా 9 మంది మాత్రమే ఉంటే, ఈ రెండు కార్పొరేట్ విద్యా సంస్థలకు కలిపి 64 మంది ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. సాంకేతికంగా దొరక్కుండా ఉండేందుకై కనిపించకుండా ఒక్కో సబ్జెక్టు పేరు రాయడం గమనార్హం.
ఇలా ప్రతి ఫలితాలలోనూ ఇలాంటి బోగస్ ర్యాంకులను ప్రకటించుకుంటూ తమ విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింపజేసుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా సుమారు 35 వేల NIT, 12 వేల IIT సీట్ల కోసం సుమారు 12 లక్షల మంది విద్యార్థులు పోటీపడుతున్నారు.
ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ఐఐటియన్ గా చూడాలనే కోరికను కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థలు ఇలా తప్పుడు ప్రకటనలతో సొమ్ము చేసుకుంటున్నాయి.
ఉన్న సీట్లు ఎన్ని? పోటీ పడుతోంది ఎంత మంది? అందరికీ ప్రవేశం ఎలా లభిస్తుంది? అనే అంశాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు.
అందుకే తల్లితండ్రులు ఇలాంటి కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్థల మోసపు ప్రకటనలకు ఆకర్షితులై ఆర్థికంగా తాము, మానసికంగా తమ పిల్లలు నష్ట పరచుకోవద్దన్నదే నిజమైన విద్యాబిమానుల అభిప్రాయం.
✍ తుమ్మలపల్లి ప్రసాద్