జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి? పాత కాలపు సినిమాల్లో చూపించిన విధంగా చెదిరిన జుట్టు. మాసిన గడ్డం. పగిలిన కళ్లద్దాలు. భుజాన వేలాడుతూ ఓ పొడవాటి సంచి. అందులో కొన్ని తెల్లకాగితాలు. చిరిగిన చొక్కా జేబుకు క్యాప్ లేని పెన్ను. ఇదే కదా? ఒరిజినల్ జర్నలిస్ట్ ప్రతీకాత్మక చిత్రం అనబడే సింబాలిక్ పిక్చర్? ఇలా ఉంటేనే కదా? జర్నలిస్టుగా భావించాలి. ఇందుకు విరుద్దంగా కోట్ల రూపాయల విలువైన బంగళాల్లో నివాసముంటూ, ఖరీదైన విలాసవంతపు కార్లలో తిరిగే వారిని జర్నలిస్టులు అనకూడదు అంతేగా?
లేదంటే ఎప్పటిదో పాతకాలం నాటి డొక్కు స్కూటర్ పై తిరిగే టంకశాల అశోక్ వంటి వారిని మాత్రమే జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలి. ఈ మధ్య ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యాక సర్కారు కల్పించిన సౌకర్యం పుణ్యం వల్ల టంకశాల అశోక్ కారులో తిరుగుతున్నారేగాని, లేదంటే ఆయన ప్రయాణం తన పాట స్కూటర్ పైనే సాగేది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకుగాను మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకునేందుకు కూడా టంకశాల అశోక్ తనకు గల స్కూటర్ పైనే వచ్చారన్నది కాదనలేని వాస్తవం. జర్నలిస్టుగా ఇప్పటికీ టంకశాల అశోక్ జీవనశైలిలో ఎటువంటి మార్పు లేదు.
ఓకే.. కాసేపు టంకశాల అశోక్ గురించి వదిలేద్దాం. పెద్ద పెద్ద పత్రికలకు ఫౌండర్ ఎడిటర్ గా పనిచేసిన జర్నలిజపు భీష్ముడు ఏబీకే ప్రసాద్ దశాబ్ధకాలానికి మించి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు. కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలోనే బస చేస్తున్నారు. అక్కడి నుంచే తన అక్షర యాత్రను కొనసాగిస్తున్నారు. పాత్రికేయ విలువలకు, జర్నలిస్టిక్ జీవన ప్రమాణాలకు వీళ్లిద్దరు మాత్రమే కొలబద్ద కాకపోవచ్చు. కానీ అక్షర విలువల పాత్రికేయంలో ఏబీకే ప్రసాద్, టంకశాల అశోక్ లకు ఖచ్చితంగా కొన్ని పేజీలు ఉంటాయి. ఇందులోనూ ఎటువంటి సందేహం లేదు. జర్నలిజంలో వాళ్ల నీతి, నిజాయితీలను ప్రశ్నించే దమ్మూ, ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఈ విషయంలో టంకశాల అశోక్, ఏబీకే వంటి పెద్దలు నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శప్రాయులు.
సంక్రాంతి పండుగ రోజు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే.. జర్నలిస్టుకు ప్రస్తుతం సింబాలిక్ లైఫ్ స్టయిల్ ఏమీ లేదు. మాసిన గడ్డాలతో, చెదిరిన జుట్టుతో, పగిలిన కళ్లద్దాలతో, చిరిగిన దుస్తులతో జర్నలిస్టులు ఎక్కడా కనిపించడం లేదు. డొక్కు స్కూటర్లపై తిరగడం లేదు. వృద్ధాశ్రమాల్లో తమ జీవన మజిలీని నయా జర్నలిస్టులెవరూ కొనసాగించడం లేదు. గచ్చిబౌలి, మణికొండ వంటి ధనిక ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన విల్లాల్లో పలువురు జర్నలిస్టులు నివాసముంటున్నారు. టయోటా ఫార్చూనర్, మెర్సిడస్ బెంజ్ వంటి కార్లలో తిరుగుతున్నారు కూడా. అంత మాత్రాన వీళ్లను జర్నలిస్టులుగా భావించడానికి వీల్లేదా? జర్నలిస్టు పరిభాషలో ఇటువంటి విలాసవంతమైన జీవితపు స్థాయికి ఎదిగినవారు పాత్రికేయులు కాదా? ఈ ప్రశ్నలన్నీ దేనికంటే..
రైతుల విషయంలో కొందరు జర్నలిస్టుల భావనే కాదు, పరిభాష కూడా మారుతోంది. పాలకుల మెప్పు పొందడానికి, రిటైర్మెంట్ తర్వాత ప్రాపకపు పదవులే లక్ష్యంగా జాలువారుతున్న అక్షరపు వికృత దృశ్యం సాక్షాత్కరిస్తోంది. ఎలా అంటే… రైతులు కార్లలో తిరగకూడదట. అలా తిరిగేవారు రైతులే కారట. వీళ్లంతా బాగా బలిసినవారన్నది నయా జర్నలిజపు పోకడకు నిదర్శనమని చెప్పక తప్పదు. పాలక నేతల ప్రయోజనాల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా వాచ్ డాగ్ లా మారిన ఓ కలం చెబుతున్న నయా భాష్యం ఇదే. రైతంటే మురికి పట్టిన రుమాలు నెత్తిన చుట్టుకుని, ముతక బనీన్ ధరించి, గోచీ గుడ్డతో, బురద కాళ్లతో మాత్రమే దర్శనమివ్వాలి. అంతకు మించి ‘రామ్ రాజ్’ బ్రాండ్ ఆహార్యంతో కనిపిస్తే ఈ కలం ఒప్పుకునేట్టు లేదు. ఖరీదైన కార్లలో తిరిగే స్థాయికి రైతు ఎదగకూడదని సదరు జర్నలిస్టు ఆణిముత్యం ఘోషిస్తున్నది.
రైతుకు సంబంధించి ఇటువంటి భావనను ఏర్పరచుకున్న సదరు జర్నలిస్టు మాత్రం ఖరీదైన కార్లలో తిరగవచ్చు. రైతు మాత్రం తిరగకూడదు. మురికివాడ నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ధనవంతుల నివాస ప్రాంతాల్లో ఈ జర్నలిస్టు రూ. కోట్ల విలువైన బంగళాలు సంపాదించుకోవచ్చు. కానీ రైతుకు డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఉండకూదు. ఉంటే ఈ కలం భాష్యంలో అతను రైతు కాదు. అందుకే ఫ్యూడల్ జర్నలిజపు రాతలు ‘వర్ధిల్లు’ గాక!