భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత రాత్రి నుంచే భద్రాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిన్న సాయంత్రం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి తెప్పోత్సవ కార్యక్రమానికి హాజరైన అశేష భక్తజనం శుక్రవారం నాటి ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు.
భద్రాచలంలో ఉదయం 5.00 గంటలకు శ్రీ సీతారామచందర స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. సీతారామచంద్రస్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడానికి అటు ఏపీ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భద్రాద్రి రాములోరిని దర్శించుకున్నారు.
అదేవిధంగా భద్రాచలంలో జరిగిన ముక్కోటి వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి పొంగులేటి మాధురి పాల్గొన్నారు. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనాన్ని చూసి తరించారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సతీమణి పొంగులేటి శ్రీ లక్ష్మి రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.