తెలంగాణా మాండలికంలో నర్మగర్భంగా, వెటకారంగా మాట్లాడే కొన్ని పదాలకు అనేక నిగూఢార్థాలు ఉంటాయి. ఒక్కోసారి ఈ పదాల కారణంగా మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణలకు దారి తీసిన ఉదంతాలు తెలంగాణా పల్లెల్లో అనేకం. ‘నన్ను అంత మాటంటావా? అని ప్రశ్నిస్తూ పరస్పరం తన్నులాటకు దిగిన ఘటనలూ లేకపోలేదు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐపీఎస్ అధికారి, డీసీపీ విజయ్ కుమార్ ను ఉద్ధేశించి చేసిన ‘ఏం నొచ్చింది నీకు..?’ అనే వ్యాఖ్య పోలీసు శాఖలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. తమ శాఖకు చెందిన ఉన్నతాధికారిని పట్టుకుని కేటీఆర్ చేసిన ఆ వ్యాఖ్యను పోలీసు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేంటి..? అనే లోతుల్లోకి వెడితే..
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణను ఎదుర్కున్న తర్వాత అదే ఆఫీసు ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ విజయ్ కుమార్ అడ్డుకున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతున్నదనే భావనతో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు సంవాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోే అసహనానికి లోనైన కేటీఆర్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ను ఉద్ధేశించి ’ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది నీకు..?’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తెలంగాణా పల్లెల్లో ఈ వ్యాఖ్యను ‘బజారు భాష’గా కూడా పెద్దలు చెబుతుంటారు. ఎవరైనా ఏదైనా పనిచేయడానికి నిరాకరించినపుడు చెప్పిన పని చేయలేదనే కోపంతో ‘ఏం నొచ్చింది నీకు?’ అని నిందిస్తుంటారు. సందర్భాన్ని బట్టి ‘నొచ్చినాది.. నీకు?’ అని కూడా అంటుంటారు. ‘చెప్పిన పని చేత్తలేవేందిరా.. నొత్తాదిర..?’ అని కూడా వ్యాఖ్యానిస్తుంటారు. మొత్తంగా నొప్పిని ‘నొచ్చిందా?’ అని పలికిన స్వర తీవ్రతను బట్టి ద్వందార్థంతోపాటు నిగూఢార్థం కూడా ఉంటుందని పలువురు చెబుతుంటారు. ఎక్కడో.. కాలితే.. అనే సామెత కూడా ‘నొచ్చిందా?’ అనే వ్యాఖ్యలోని పద సారూప్యతను గోచరింపజేస్తుందని నిర్వచిస్తుంటారు.
ఇంతకీ ‘నొచ్చిందా? అనే పదానికి నిగూఢార్థం ఏంటనే ప్రశ్నకు వస్తే.. పత్రికా భాషలో ప్రస్తావించలేని అర్థపు పదం అది. కాస్త గ్రాంథిక భాషలో చెప్పాలంటే ‘మలద్వారం నొచ్చిందా?’ అనే ప్రశ్నను రేకెత్తించేలా ‘నొచ్చిందా?’ అనే పదాన్ని తెలంగాణాలో వాడుతుంటారు. నిష్కర్షగా చెప్పాలంటే ఆయా వ్యాఖ్యను ఎదుర్కున్నవారి మనసు తీవ్రంగా నొచ్చుకునే పదమిది. అయితే కేటీఆర్ స్వరం నుంచి వెలువడిన ‘ఏం నొచ్చింది నీకు…?’ అనే వ్యాఖ్యకు సంబంధించి ఆయన స్వర తీవ్రత ఏ అర్థాన్ని స్ఫురింపజేస్తుందో ఈ దిగువన గల వీడియోలో చూడవచ్చు..