బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ట్రోక్ మీద స్ట్రోక్ తగులుతోంది. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో ఇప్పటికే ఆయన కోర్టులను ఆశ్రయిస్తుండగా, తాజాగా కేటీఆర్ పై ఏసీబీ కి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయని బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తూ ఏసీబీని ఆశ్రయించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాగా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కేటీఆర్ ఇప్పటికే నిందితునిగా ఉన్నారు. గురువారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. విచారణ సందర్భంగా తన వెంట లాయర్ ను తీసుకువెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ అంశంలో కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే విచారణ జరిగే సమయంలో దర్యాప్తు అధికారి, కేటీఆర్ ఓ గదిలో ఉంటే, వాళ్లిద్దరూ కనిపించే దూరంలో కేటీఆర్ తరపు న్యాయవాది ఉండేలా మాత్రమే అనుమతిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ ను ఏసీబీ విచారించే సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలనే అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది.
మరో వైపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అర్వింద్ కుమార్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో బీఎల్ఎన్ రెడ్డి అనే మాజీ అధికారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు జరిగిన సమయంలో బీఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీరుగా ఉన్నారు. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి తన దర్యాప్తును వేగవంతం చేసింది.
కాగా ఆయా పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చూడవచ్చు..