ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో తెలంగాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈమేరకు ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టేసిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల్లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టులో న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించవచ్చనే సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఇప్పటికే కెవియట్ పిటిషన్ ను దాఖలు చేసింది. కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదన వినాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.