బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కదలికలపై తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. అంతేకాదు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఉపసంహరించింది. ఈ పరిణామాల్లోనే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో.. ఈ కేసు అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమేరకు తన లీగల్ టీంతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారనేది వార్తల సారాంశం.
దీంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ ను వేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేస్తే, తమ వాదనలను వినాలని అభ్యర్థిస్తూ ప్రభుత్వం కెవియట్ పిటిషన్ ను దాఖలు చేసింది.
ఇదిలా ఉండగా ఫార్ములా ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, మరో అధికారి బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తాజా సమాచారం అందుతోంది. కేటీఆర్ నివాసంలో కూడా సోదాలు చేసేందుకు ఏసీబీ అధికారులు కోర్టు నుంచి సర్చ్ వారంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా కేటీఆర్ నివాసంలో కూడా ఏసీబీ సోదాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు వస్తున్న వార్తలు ధ్రువపడాల్సి ఉంది.
ఇంకోవైపు కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మమరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 16వ తేదీన విచారణకు రావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. తాజా పరిణామాలపై తన ‘ఎక్స్’ ఖాతాలో కేటీఆర్ స్పందించారు. తన మాటలు రాసిపెట్టుకోవాలని, ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామని, ఆరోపణలు తనను తగ్గించలేవని, కుట్రలతో తన నోరు మూయించలేరని కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. మొత్తంగా కేటీఆర్ పై ఓవైపు ఏసీబీ కేసు, ఇంకోవైపు ఈడీ నోటీసుల పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.