బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహరంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే మాదాపూర్ లోని గ్రీన్ కో సంస్థ కార్యాలయంలో ఈ ఉదయం నుంచీ సోదాలు చేస్తోంది. ఎన్నికల బాండ్ల కొనుగోలుకు సంబంధించి ఏసీబీ ఈ సోదాలు నిర్వహిస్తోంది. గ్రీన్ కో అనుంబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు రూ. 41 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు అందినట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ చేసుకున్న వినతినీ హైకోర్టు తిరస్కరించింది. అంతేకాదు కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఉపసంహరించింది.
ఈ పరిణామాల్లో ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు దృశ్యం అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో విచారణకు రావాలని ఏసీబీ రెండోసారి కేటీఆర్ కు నోటీసులిచ్చింది. మొత్తం పరిణామాల్లో కేటీఆర్ తన లీగల్ టీంతో చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్సును ఏసీబీ కేటీఆర్ కు ఇస్తుందా? హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించకముందే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? ఏసీబీ దూకుడు చర్యలు ఎటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి? గ్రీన్ కో సంస్థ కార్యాయాల్లో ఏసీబీ సోదాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయి? అనే ప్రశ్నలపై రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.