మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడేచొక్కారావు అలియాస్ దామోదర్ సొంత గ్రామంలో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అడుగిడారు. దామోదర్ తల్లి బతుకమ్మను ఎస్పీ ఈ సందర్భంగా పలకరించారు. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బతుకమ్మకు వైద్యులతో పరీక్షలు చేయించారు. నరాల బలహీనత, కంటి చూపు వంటి సమస్యలతో దామోదర్ తల్లి బాధపడుతున్నట్లు గుర్తించారు.
‘పోరుకన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి’ అంటూ ఎస్పీ శబరీష్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. తుపాకులు చేబూని అడవి బాట పట్టిన నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కాల్వపల్లి గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ, ఇంకా 103 మంది తెలంగాణాకు చెందిన వ్యక్తులు మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు చెప్పారు.
అడవుల్లోని నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయి తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ప్రభుత్వ పరంగా పునరావాస చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్పీ శబరీష్ చెప్పారు.