జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీల భవితవ్యమేంటి? మున్ముందు ఈ సొసైటీలు నిర్వహించాల్సిన కర్తవ్యమేంటి? రాబోయే రోజుల్లో సొసైటీలతో జర్నలిస్టులకు ఇక ఏ అవసరమూ ఉండదా? ఈ తాజా ప్రశ్నలన్నీ జర్నలిస్టు సర్కిళ్లో భిన్న వాదనలకు తావు కల్పిస్తున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు గురించి తెలిసిందే. దీంతో విలేకరులకు ఇళ్ల స్థలాలు.. అనే అంశంపై పాలకులు కూడా పెద్దగా ఆసక్తి కనబరిచే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు.
అయినప్పటికీ తెలంగాణా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న విలేకరులకు శుభవార్త చెప్పారు. విలేకరులకేదో మేలు చేద్దామని భావిస్తే, కోర్టు నుంచి ఉత్తర్వు వచ్చిందని పేర్కొన్నారు. ఏదో రకంగా జర్నలిస్టులకు మేలు చేయాలనే తపన తనకు ఉన్నట్లు పొంగులేటి చెప్పారు. ఇందులో భాగంగానే దారిద్ర్య రేఖకు దిగువన గల కేటగిరీ (బీపీఎల్) కింద విలేకరులకు నివాస వసతి కల్పిస్తామని ప్రకటించారు. ఈ అంశంలో వివిధ రూపాల్లో జర్నలిస్టులకు మేలు కల్పిస్తామని స్పష్టం చేశారు. బీపీఎల్ కోటా కింద స్థలం ఇవ్వడమో, టవర్ల నిర్మాణం చేయడమో, వేర్వేరు వర్గాల కోసం ఇప్పటికే నిర్మించిన ఇళ్లల్లో వేలం పద్ధతితో అవకాశం కల్పించడమో… ఇటువంటి ఏదో ఓ కోణంలో విలేకరులకు నివాస వసతి కల్పిస్తామని మంత్రి క్లియర్ గానే చెప్పారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన జర్నలిస్టులకు భారీ ఊరట కల్పించిందనే చెప్పాలి. అయితే ఈ అంశంలో జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీలకు పాత్ర ఉంటుందా? అనేది తాజా ప్రశ్న. ఎందుకంటే ఇళ్ల స్థలాల అంశంలో జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీలు ఇప్పటి వరకు నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం. తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి జరిగిన ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయంటే అతిశయోక్తి కాదు. దశాబ్ధాల చారిత్రక నేపథ్యం గల జేసీహెచ్ఎస్ఎల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జర్నలిస్టు ప్యానళ్లు ఈ ఎన్నికల్లో తలపడ్డాయి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆశను నెరవేర్చిన భారీ నేపథ్యం ఈ సొసైటీకి ఉండడమే ఇందుకు కారణం కావచ్చు.
గడచిన కొన్నేళ్లలో వివిధ కారణాల వల్ల రాజధానిలోనేగాక అనేక జిల్లాల్లో జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీలు అనేకం పుట్టుకొచ్చాయి. వీటి ఆవిర్భావం వెనుక కేవలం కొందరు పాలకుల కాంక్ష మాత్రమే కాదు, అందుకు దారి తీసిన పరిస్థితులు కూడా అనేకం. జిల్లాల్లోనూ వేర్వేరు పేర్లతో జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీలు అనేకం ఏర్పడ్డాయి. అధికారంలో గల నాయకుల పేర్లతోనూ కొన్ని హౌజింగ్ సొసైటీలు ఆవిర్భవించాయి. అయితే ఆ తర్వాత అధికారం చేతులు మారిన పరిణామాల్లో సొసైటీలకు గల అప్పటి పాలకవర్గ నాయకుల పేర్లను తుడిచేయాల్సిన పరిణామాలకు కారకులెవరన్నది అప్రస్తుతం. ఎందుకంటే పేరు ఎవరిదైనప్పటికీ, తమ గూడు కల నెరవేరాలన్నదే జర్నలిస్టుల ప్రధాన లక్ష్యం. అయినప్పటికీ జర్నలిస్టలు ఇళ్ల స్థలాల కోరిక దశాబ్ధాలుగా నెరవేరనే లేదు.
ఈ అంశంలో అటు పాలకులనుగాని, ఇటు కొన్ని జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీల కమిటీలను గానీ ఇప్పుడు వేలెత్తిచూపడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా లేదు. అసలు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సొసైటీలన్నీ చట్టబద్ధంగానే ఏర్పాటయ్యాయా? వాటికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయా? కనీసం జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నల జోలికి వెడితే విషయం రాద్దాంతమవుతుందనే వాదనలు ఉన్నాయి.
నిజానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో సొసైటీల పాత్ర చాలా గొప్పది. సభ్యత్వం, సమావేశాలు, ఎన్నికలు అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్థలాలు సాధించి, వాటిని ప్రక్రియ ప్రకారం లాటరీ పద్ధతిలో అర్హులైనవారికి అప్పగించడమే వీటి ప్రధాన విధి. కానీ స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చిన తర్వాత కూడా, వాటిని స్వాధీనం చేసుకోవడానికి అనుసరించే పద్ధతుల అంశంలో వైఫల్యం చెందిన సొసైటీల గురించి కూడా ఇప్పుడు చర్చించుకుని కూడా ప్రయోజనం లేదు. మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఆశ సన్నగిల్లిన పరిస్థితుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీపి కబురు చెప్పారు.
మంత్రి ప్రకటించిన ప్రకారం.. బీపీఎల్ కింద జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చే అంశంలో సొసైటీల పాత్ర ఏమిటి? అనేది తాజా ప్రశ్న. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు పరిణామాల్లో సొసైటీలకు నేరుగా స్థలాలు కేటాయించే పరిస్థితే ఉండకపోవచ్చు. దీంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అప్పగించే అంశంలో సొసైటీల పాత్ర కనుమరుగు కావచ్చు కూడా. సొసైటీలకు స్థలాన్ని అప్పగిస్తే, సభ్యులకు పంపిణీ చేసే ప్రక్రియను సొసైటీ కమిటీ తీసుకుంటుంది. కానీ తాజా పరిస్థితుల్లో ప్రభుత్వమే నేరుగా జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు మార్గదర్శకాలు ఏమిటనే అంశం కూడా కొత్తగా తెరపైకి వస్తుంది.
అయితే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సంబంధిత కక్షిదారులు ‘రివ్యూ’ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. రివ్యూ పిటిషన్ పై తీర్పు సానుకూలంగా వస్తే జర్నలిస్టులు పండుగ చేసుకోవచ్చు. జర్నలిస్టు హౌజింగ్ సొసైటీలకు స్థలాల కేటాయింపులో పాలకులు ముందడుగు వేయవచ్చు. కానీ రివ్యూ పిటిషన్ పై ఆశించిన తీర్పు రాకుంటే, ఆ తర్వాత ‘క్యూరేటివ్’ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం సంబంధిత కక్షిదారులకు ఉంటుంది. అప్పుడైనా అనుకూల తీర్పు వస్తే తప్ప జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీలకు ప్రాధాన్యత ఉండకపోవచ్చు. లేనిపక్షంలో గతంలో లభించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న జర్నలిస్టు కాలనీ వాసుల సంక్షేమ చర్యలు, సొసైటీ ఖజానాలో గల నిధుల యాజమాన్యం, సొసైటీ స్థలాల లీజు ద్వారా ఆదాయ మార్గాల పెంపును అన్వేషించడం మినహా మరే వ్యాపకం వీటికి ఉండే అవకాశం లేదని సీనియర్ జర్నలిస్టులు పేర్కొంటున్నారు.