నష్టాల్లో కొనసాగుతున్న ఆర్టీసీని తాము ఇక మోయలేమని కేసీఆర్ సర్కార్ తేల్చేసినట్లేనా? ప్రజారవాణా వ్యవస్థ అయినంత మాత్రాన నష్టాలతో దాన్ని ముందుకు నడిపించలేమని చేతులెత్తేసినట్లేనా? కార్మికులకు జీతాలు కూడా ఇచ్చేందుకు కూడా నిధులు లేవని స్పష్టం చేసినట్లేనా? ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయడం అనివార్యమైందని పరోక్షంగా చెబుతూ, ప్రజా రవాణా బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లేనా? తెలంగాణా ప్రభుత్వం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలు బుధవారం వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ల నేపథ్యంలో రేకెత్తుతున్న ప్రశ్నలివి.
ఆర్టీసీకి తాము నయాపైసా బాకీ లేమని, తమకే ఆర్టీసీ బాకీ ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్ ద్వారా స్పష్టం చేయగా, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి వాడుకున్న మొత్తంలో రూ. 200 కోట్లు వెంటనే చెల్లించాలని మరోవైపు హైకోర్టు ఆర్టీసీని ఆదేశించడం గమనార్హం. ఆర్టీసీకి రుణం, పెట్టుబడులు, ఇతర పద్దుల కింద రూ.3,903 కోట్లు చెల్లించామని, ఆర్టీసీయే మోటారు వాహన పన్ను బకాయి కింద ప్రభుత్వానికి రూ.540 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర ఆర్థికశాఖ ఆఫిడవిట్ దాఖలు చేయగా, ప్రభుత్వం నుంచి రాయితీల రీయంబర్స్మెంట్ 2014-15 నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు రూ.3,006.15 కోట్లు రావాల్సి ఉండగా, రూ.3,903.55 కోట్లు వచ్చాయి. అదనంగా రూ.897.40 కోట్లు ప్రభుత్వమే ఇచ్చిందని టీఎస్ ఆర్టీసీ మరో అఫిడవిట్ ను దాఖలు చేసింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ కూడా మరో అఫిడవిట్ ను దాఖలు చేస్తూ, బడ్జెట్ లోటు లేనంత వరకు తాము డబ్బులు చెల్లించామని, ఇందులో భాగంగానే 2015-16 వరకు రూ.336.40 కోట్లు ఇచ్చామని చెప్పింది. కానీ 2015-16 నుంచి లోటు బడ్జెట్ ఉండటంతో చెల్లించలేదని, చట్టప్రకారం చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, ఇదే విషయాన్ని ఆర్థికశాఖ, ఆర్టీసీ కూడా ధ్రువీకరించాయని తన అఫిడవిట్ లో జీహెచ్ఎంసీ తేల్చేసింది. ప్రభుత్వంతోపాటు ఆయా సంస్థలు వేర్వేరుగా దాఖలు చేసిన అఫిడవిట్ల సారాంశం నేపథ్యంలో ఆర్టీసీ భవితవ్యంపై కేసీఆర్ సర్కార్ యోచన ఏమిటనే అంశంపై భిన్నవాదనలను వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా అఫిడవిట్ల సమర్పణ ద్వారా కేసీఆర్ సర్కార్ అంతరంగం దాదాపుగా వెల్లడైనట్లుగానే పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్టీసీ అంశంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెడతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపైనా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఎవరికైనా ఉంటుందని, ఆర్టీసీ కార్మికులు మాత్రం వెళ్లలేరా? అని న్యాయవాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుందని, హైకోర్టు తీర్పు రాకముందే సుప్రీంకోర్టుకు వెడతామని ప్రకటించడమంటే ఈ కోర్టుపై నమ్మకం లేనట్లు అడ్మిట్ అయినట్లేనా? అని ఓ ప్రముఖ న్యాయవాది ప్రశ్నించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లడం ప్రాథమిక హక్కుగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్ పైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ సంస్థకు వస్తున్న నష్టాల అంశంలో జీహెచ్ఎంసీ చెల్లించిన మొత్తానికి సంబంధించి కాంట్రిబ్యూషన్ అనే పదం మినహా ప్రభుత్వ పరంగా ఎటువంటి చట్టంగాని, ఉత్తర్వుగాని లేకపోవడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ చెల్లింపులకు సంబంధించి అప్పట్లో ప్రభుత్వపరంగా ఎంవోయూగాని, ఉత్తర్వుగాని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ఆర్టీసీ కార్మికవర్గాలతోపాటు న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం స్పష్టంగా వ్యవహరించని ఫలితమే ప్రస్తుత జీహెచ్ఎంసీ వాదనగా ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా ప్రభుత్వం ఆర్టీసీ, జీహెచ్ఎంసీల అఫిడవిట్ల నేపథ్యాన్ని పరిశీలిస్తే ప్రజారవాణా సంస్థను కొనసాగించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పకుంటున్నట్లు గోచరిస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మెపై బుధవారం గంటలకొద్దీ సమీక్షించిన కేసీఆర్ సంస్థ భవితవ్యం గురించి ఎటువంటి ప్రకటన చేస్తారనే అంశంపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.