ప్రముఖ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వాద, ప్రతివాదనల అనంతరం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు జడ్జి ఆదేశించారు.
అయితే ఇదే దశలో తనపై నమోదైన కేసులో అల్లు అర్జున్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ సాయంత్రం నాలుగు గంటల నుంచి వాద, ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే ఆదేశాలను అనుసరించి మాత్రమే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ అమలు తీరు ఆధారపడి ఉంటుందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పు తర్వాతే రిమాండ్ పై స్పష్టత వస్తుందంటున్నారు. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఉన్నారు.
UPDATE:
అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన సంధ్య థియేటర్ యజమానులకు కూడా ఇవే ఉత్తర్వులు వర్తిస్తాయని, ఒక్కొక్కరు రూ. 50 వేల పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది