జర్నలిస్టుపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు రూటు మార్చారు. ఓ టీవీ ఛానల్ కు చెందిన లోగో స్యూర్ మైకు తీసుకుని ఆగ్రహంతో రిపోర్టర్ ను తీవ్రంగా గాయపర్చిన మోహన్ బాబు తాజాగా విడుదల చేసిన ఆడియోలో సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
తన దాడిలో గాయపడిన రిపోర్టర్ తనకు సోదరుడితో సమానమని, దైవ సాక్షిగా చెబుతున్నానంటూ విడుదల చేసిన 11 నిమిషాల నిడివి గల ఆడియోలో మోహన్ బాబు తన చర్యకు సమర్థించుకునేందుకు సైతం విఫలయత్నం చేసినట్లు కనిపిస్తోందని మీడియా వర్గాలు అంటున్నాయి. మోహన్ బాబు తాజాగా ఈ ఆడియోను విడుదల చేయడానికి అసలు కారణం వేరే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విలేకరిపై దాడి ఘటనలో పోలీసులు తమకు అందిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ లోని 118 (బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దాడి చేశారనే అభియోగానికి మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అయితే గాయపడిన రిపోర్టర్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, నెలరోజులపాటు అతను నేరుగా ఆహారం తీసుకునే పరిస్థితి లేదని సంబంధిత ఛానల్ ముఖ్యుడొకరు ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే దాడి ఘటనలో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించి, న్యాయ సలహా తీసుకుని కేసు నమోదులోని సెక్షన్ ను మార్చారు. నమోదైన కేసులో బీఎన్ఎస్ లోని 109 సెక్షన్ ను చేర్చారు. హత్యాయత్నం కిందకు ఈ సెక్షన్ వస్తుంది. కేసు తీవ్రత కూడా మారుతుంది. దీంతో మోహన్ బాబు రూటు మార్చి తాజా ఆడియోను విడుదల చేసి ఉంటారనే వ్యాఖ్యలు జర్నలిస్టు సర్కిళ్లలో వినిపిస్తున్నాయి.
ఇంతకీ తాజా వీడియోలో మోహన్ బాబు ఏమన్నారో ఇక్కడ చూడవచ్చు..