బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్ట్ చేశారు. తన విధులకు ఆటంకం కలిగించినట్లు బంజారాహిల్స్ సీఐ రాఘవేంద్ర నిన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కౌశిక్ రెడ్డిపైనేగాక ఆయన అనుచరులు మరో ఇరవై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాల్లో కొండాపూర్ లో గల పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఈ ఉదయం భారీ ఎత్తును వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు అంతకు ముందే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.