ఏటూరునాగారం మండలం చెల్పాక వద్ద నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ స్పందించారు. విషపదార్థాలు కలిపి ప్రయోగించి స్పృహ కోల్పోయిన తర్వాత పోలీసులు నక్సలైట్లపై కాల్పులు జరిపినట్లు పౌరహక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. ఇది పూర్తిగా దుష్ప్రచారమని ఆయన అన్నారు. ఈమేరకు ఆయన సోమవారం డీజీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎన్కౌంటర్ ఘటనకు ముందు ఇన్ఫ్మార్లనే నెపంతో ఇద్దరు ఆదివాసీలైన ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను మావోయిస్టులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారని డీజీపీ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారన్నారు. మావోలు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి పోలీసులపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.
ఫలితంగా పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు సాయుధ మావోయిస్టులు మరణించారని చెప్పారు. డెడ్ బాడీల శవ పరీక్షలు హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం సూచనల మేరకు జరుగుతున్నాయని, దీంతోపాటు కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీనినియమించామని, దర్యాప్తు జరుగుతోందని డీజీపీ తన ప్రకటనలో వివరించారు.