ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది చల్లా శంకర్ ఆదివారం ఉదయం హఠాన్మరణం చెందారు. గుండె, బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. సహచర న్యాయవాదులు అందించిన వివరాల ప్రకారం… ఈ ఉదయం నిద్ర లేచిన శంకర్ తనకు అవసరమైన టాబ్లెట్ కోసం మున్సిపల్ ఆఫీసు సమీపాన గల ఓ మెడికల్ స్టోర్ కు వెళ్లారు. కళ్లు తిరుగుతుండగా ఆటో ఎక్కి తిరిగి వచ్చిన శంకర్ ఇంట్లోకి వెళ్లగానే కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోనం లేకపోయింది.
న్యాయవాద వృత్తిలో చల్లా శంకర్ ‘శంకరన్న’గా ప్రాచుర్యం పొందారు. విప్లవ, ప్రజా హక్కుల ఉద్యమాల కేరాఫ్ అడ్రస్ గా చల్లా శంకరన్న పేరు తెచ్చుకున్నారు. తాను జీవించినంత కాలం ప్రజలను, ప్రజాఉద్యమాలను శంకరన్న ప్రేమించారు. తన ఇంటినే విప్లవ కార్యకర్తలకు నిలయం చేశారని, అన్నం పెట్టి, ఆశ్రయం కల్పించారని సహచర న్యాయవాద వర్గాలు గుర్తు చేసుకున్నాయి.
తనకు మాత్రమే స్వంతమనిపించే లూనా ద్విచక్ర వాహనంతో శంకరన్న కనిపించేవారు. తీవ్ర నిర్బంధ కాలంలో కూడా భయపడకుండా విప్లవ పార్టీ కార్యకర్తల కేసులను శంకరన్న వాదించేవారు. తన లాయర్ వృత్తిని విప్లవకరంగా చేసుకున్నారని తోటి లాయర్లు గుర్తు చేసుకున్నారు. శంకరన్న భౌతిక కాయానికి ప్రముఖ న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణాకర్ తదితరులు నివాళులర్పించారు.