ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రానికి సమీపంలోనే గల చెల్పాక అటవీ ప్రాంతంలో ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఏడుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో మావోయిస్టు దళం చిక్కుకున్నట్లు సమాచారం.
కాగా ఇదే చెల్పాక గ్రామ సమీపాన 1991 జూన్ 21వ తేదీన అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ నక్సలైట్లు భారీ మందుపాతర పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అప్పటి ఈ ఘటనలో ఏటూరునాగారం సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కిషోర్ కుమార్ సహా ఏడుగురు సీఆర్ పీఎఫ్ పోలీసులు మరణించారు.
రాజీవ్ గాంధీ మరణానంతరం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రోజునే నక్సలైట్లు ఈ ఘటనకు పాల్పడ్డారు. చెల్పాక పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులో సిరా పోసి, పోలీసులకు సమాచారం అందేలా చేసి, వారిని రప్పించి మరీ నక్సల్స్ ఈ భారీ మందుపాతర పేల్చారు. అదే గ్రామ సమీపాన తాజాగా భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. ఎన్కౌంటర్ మృతుల్లో నక్సల్ కీలక నేతలు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఘటనను పోలీసుల ధ్రువీకరించలేదు.
UPDATE:
చెల్పాక ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు పార్టీ ఇల్లెందు – నర్సంపేట ఏరియా దళం కమాండర్ భద్రు అలియాస్ పాపన్న ఉన్నట్లు తాజా సమాచారం.