తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహారాష్ట్రలో మకాం వేశారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న వేళ పొంగులేటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 18వ తేదీ వరకు మంత్రి పొంగులేటి మహారాష్ట్రలోనే మకాం వేయనున్నారు. అక్కడ కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థుల గెలుపునకు, ముఖ్యంగా తెలుగు ఓటర్ల ప్రభావం గల ప్రాంతాల్లో పొంగులేటి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగులేటి గురువారం నుంచే అక్కడ తన ప్రచార కార్యకలాపాలను ప్రారంభించారు. నాందేడ్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారం సభల్లో పొంగులేటి ప్రసంగించారు. మహారాష్ట్రలో మహా అఘాడీ కూటమి విజయం తథ్యమని, ఇందుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పొంగులేటి నాందేడ్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.