వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై, ఇతర ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఈమేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు వద్ద ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
కలెక్టర్ పై దాడి ఘటనలో కీలక నిందితుడు భోగముని సురేష్ తో ఫోన్ సంభాషణ జరిపినట్లు పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించిన సంగతి తెలిసిందే. సురేష్ తమ పార్టీకి చెందినవాడేనని, ప్రతిరోజూ మాట్లాడుతుంటాడని, ఇందులో భాగంగానే దాడి జరిగిన రోజు కూడా సురేష్ తనతో మాట్లాడాడని నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంగీకరించారు. కాగా కలెక్టర్ పై దాడి జరిగిన లగచర్ల ఘటనలో పోలీసులు ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేయగా, మరికొందరు వారి అదుపులో ఉన్నారు.