రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నఫలంగా ఖమ్మం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రెండు రోజులపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు షెడ్యూల్ విడుదల కాగా, బుధవారం నాటి అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి ఆయన అర్జంటుగా రాజధానికి పయనమయ్యారు. దీంతో తాను ప్రకటించిన ‘పొలిటికల్ బాంబు’ల పేల్చివేత కోసమే మంత్రి అత్యవసరంగా హైదరాబాద్ బయలుదేరారనేది విశ్వసనీయ సమాచారం.
నిజానికి మంత్రి పొంగులేటి మంగళవారం ఖమ్మం జిల్లాలో అత్యంత ఉత్సాహంగా పర్యటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోనేగాక, ఖమ్మం నియోజకవర్గంలోనూ వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం కూడా పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అయితే అకస్మాత్తుగా మంత్రి పొంగులేటి తన పర్యటనను వాయిదా వేసుకుని హైదరాబాద్ బయలుదేరడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే మంత్రి అయ్యాక పొంగులేటి తన పర్యటనను వాయిదా వేసుకున్న ఘటన బహుషా ఇది రెండోది కావచ్చు.
బుధవారంనాటి పీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అనుచరగణం చెబుతోంది. మంగళవారం నాటి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాంచి జోష్ లో ఉన్నారు. సియోల్ లో ప్రకటించిన పొలిటికల్ బాంబులు ఎప్పుడు పేలుతాయని తన సన్నిహితులు కొందరు అడగ్గా, దీపావళికి ముందేనంటూ పొంగులేటి చిరునవ్వుతో సమాధానమిచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల్లో పొంగులేటి అర్జంటుగా తన బుధవారం నాటి పర్యటనను వాయిదా వేసుకుని మరీ రాజధానికి బయలుదేరడం భిన్న ఊహాగానాలకు తెరతీసింది.
బుధవారం నిర్వహించే పీసీసీ సమావేశంలో ‘పొలటికల్ బాంబు’ల గురించి చర్చిస్తారని సమాచారం. ఈ బాంబులు పేలిన తర్వాత జరిగే పరిణామాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పందించే అంశంపై పీసీసీ సమావేశంలో దిశా, నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. సియోల్ లోనే కాదు, హైదరాబాద్ చేరుకున్నాక కూడా పొలిటికల్ బాంబుల గురించి పొంగులేటి పునరుద్ఘాటించారు. దీపావళికి ఇంకా టైముందని కూడా చెప్పారు. పండక్కి ముందే ఖచ్చితంగా పొలిటికల్ బాంబు పేలుతుందని క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్ కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ మరింత వేధించవచ్చని, ఏ పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన బీఆర్ఎస్ కేడర్ కు ఎక్స్ వేదికగా పిలుపునివ్వడం గమనార్హం. ఏం జరిగినా ఆశ్చర్యపోవద్దని కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదే దశలో కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ అనుకూల మీడియాగా ప్రాచుర్యం పొందిన కొన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తుండడం గమనార్హం.