భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దారుణం జరిగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచరుడు, జర్నలిస్టు నిట్టా సుదర్శన్ (34)పై గత అర్ధరాత్రి ప్రాంతంలో పాశవిక దాడి జరిగింది. నిందితులు రాత్రి వేళ కాపుకాసి మరీ అమానుషంగా దాడి చేయడంతో సుదర్శన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఇల్లెందు పట్టణంలో ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు నిట్టా సుదర్శన్ గత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రయణిస్తుండగా, ఐదుగురు వ్యక్తులు వెంబడించి, జగదాంబ గుంపు వద్ద అటకాయించి దాడి చేశారు. కర్రలతో, బీరు బాటిళ్లతో దారుణంగా దాడి చేయడంతో సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డారు.
గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకోసం సుదర్శన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓ పత్రికలో జర్నలిస్టుగానూ పనిచేస్తున్న సుదర్శన్ ఇప్పటికీ తీన్మార్ మల్లన్న టీంలో సభ్యునిగా కొనసాగుతున్నట్లు స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు.
తొలుత ఇల్లెందు ఆసుప్రతిలో చికిత్స చేసిన అనంతరం సుదర్శన్ ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తనపై దాడి చేసినవారిపై సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై బీఎన్ఎస్ 191(30; 61(20; 109, 308(3), 329 (4), 49, 351(20; రెడ్ విత్ 190, సెక్షన్ 3(1)(ఆర్) (ఎస్), 3(2)(వీఏ) ఆఫ్ ఎస్సీ ఎస్టీ పీవోఏ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లెందు పోలీసులు వివరించారు.