ఓ యూ ట్యూబ్ ఛానల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులపై ఖమ్మం నగర పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. ఈమేరకు సంబంధిత ఛానల్ కు చెందిన CEO సహా ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
ఖమ్మం వన్ టౌన్ సీఐ కథనం ప్రకారం.. నగరంలోని ప్రముఖ ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కల్పిత వార్తను తయారు చేసి హాస్పిటల్ యాజమాన్యానికి చూపించి, ప్రతి ఏడాది రూ. 5.00 లక్షల మొత్తం యాడ్ రూపంలో చెల్లించకపోతే తమ యూట్యూబ్ ఛానల్ లో న్యూస్ అప్లోడ్ చేసి హాస్పిటల్ పేరు ప్రఖ్యాతులను దెబ్బతీస్తామని నిందితులు బెదిరించారు.
దీంతో హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్ టౌన్ పోలీసులు విచారణ జరిపారు. ఇందుకు బాధ్యులుగా గుర్తించిన సదరు యూట్యూబ్ ఛానల్ CEO పుచ్చకాయలు ప్రకాష్, బ్యూరో చీఫ్ అత్తులూరి రామకృష్ణ అలియాస్ రాంకీ, అసిస్టెంట్ కెమెరామన్ SK. బాబా అనే వ్యక్తులపై Extortion (దోపిడీ) కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురినీ బుధవారం అదుపులోకి తీసుకుని రిమండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ ఓ ప్రకటనలో వివరించారు.