అనాథ పిల్లలతో ఖమ్మం ఐఏఎస్ అధికారులు డిన్నర్ చేశారు. జిల్లాలో అత్యున్నత స్థాయి అధికారులు తమతో కలిసి డిన్నర్ చేయడంతో అనాథ పిల్లల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఇందుకు పూనుకోవడం విశేషం. బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అనంతరం బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బాలసదనంలో ఉన్న 27 మంది పిల్లలను తీసుకుని ఖమ్మం నగరంలోని ప్రముఖ రెస్టారెంటుకు వెళ్లారు. కలెక్టర్ తోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలు కూడా అనాథ పిల్లలతో కలిసి డిన్నర్ చేశారు. పిల్లలతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సహా ఇతర ఐఏఎస్ అధికారులు సరదాగా గడిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, విద్యతో మంచి భవిష్యత్తు సాధ్యమన్నారు. అనాథలనే భావన మనస్సు నుండి తీసివేయాలని, జిల్లా యంత్రాంగం మీతో ఉన్నారనే ధైర్యంతో ముందుకు సాగాలని కోరారు. మనం బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు. అనాధ అనే భావన తొలగించుకోవాలని, ఇతర పిల్లలతో సమానంగా అన్ని రంగాలలో రాణించేందుకు అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం విద్యపై శ్రద్ధ పెట్టాలని, మనం ఇప్పుడు బాగా చదువుకుంటే మంచి స్థాయికి చేరుకొని ఆనందమైన జీవితం గడపవచ్చని, నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించవచ్చు అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిల్లలకు హితవు చెప్పారు. బాలసదనంలోని అనాథ పిల్లలతో ఐఏఎస్ అధికారుల డిన్నర్ వీడియోను దిగువన చూడవచ్చు..