జర్నలిజంలో క్రియేటివిటీ ఉండాలి. జర్నలిస్టు కనీసం దివ్య దృష్టినన్నా కలిగి ఉండాలి. లేదంటే అతీంత్రీయ శక్తులను సముపార్జించుకోవాలి. భౌతికదేహం ఎక్కడ ఉన్నప్పటికీ, ఆత్మను పరకాయ ప్రవేశం చేయించగలిగే శక్తియుక్తులు నేర్చుకోవాలి. ఇవేవీ లేకుండా పత్రిక నడపడం, న్యూస్ ఛానల్ ను నిర్వహించడం, వార్తను వండి వడ్డించడం ఎవరి వల్లా కాకపోవచ్చు.. బహుషా ఒకే ఒక్క ఆర్కే అలియాస్ ఏబీఎన్ రాధాకృష్ణ వంటి ఆంధ్రజ్యోతి మీడియా అధిపతికి తప్ప. ఎందుకంటే..?
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిన్నతెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు ఏకాంతంగా భేటీ అయిన సంగతి తెలిసిందే కదా? ఈ ఇద్దరు సీఎంల భేటీ సందర్భంగా కనీసం ఒక్కరంటే ఒక్క అధికారి కూడా వారి వెంట లేరు. కనీసం చీఫ్ సెక్రటరీలు కూడా లేరు. జగన్ ప్రగతి భవన్ లో అడుగిడగానే తెలంగాణా సీఎం కేసీఆర్ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. జగన్ వెంట వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉండగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు మాత్రమే ప్రగతి భవన్ లో ఉన్నారు. జగన్ కు స్వాగత సత్కారాల సందర్భంగా జరగాల్సిన లాంఛనప్రాయ మర్యాదలన్నీ జరిగాయి. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసిన తర్వాత ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన సమావేశానికి సంబంధించిన వివరాలతో ప్రగతి భవన్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన కూడా వెలువడింది. ప్రజాప్రయోజనం, సహజ సరిహద్దు రాష్ట్రాలు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, గోదావరి జలాలు, 9, 10వ షెడ్యూల్లోని అంశాల పరిష్కారం, దేశ, స్థానిక పరిస్థితులు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించినట్లు అధికారిక ప్రకటన వివరించింది. సమావేశం నుంచే ఇద్దరు సీఎంలు తమ తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడినట్లు కూడా అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. దాదాపు అన్ని ప్రధాన పత్రికలు అధికారిక ప్రకటనను మాత్రమే వార్తా కథనాలుగా ప్రచురించాల్సిన అనివార్య స్థితి.
కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ఇందుకు భిన్నంగా ఉండడమే ఇక్కడ అసలు విశేషం. ఇద్దరు సీఎంల ఏకాంత భేటీలో కేసీఆర్ రాజకీయంగానేగాక, పాలనాపరంగానూ జగన్ కు దిశా, నిర్దేశం చేసినట్లు ఈ కథనపు సారాంశం. అమరావతి రాజధాని మూడు ముక్కల అంశంలో ముందుకే వెళ్లాలని, ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నిక్లలో విజయం సాధించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, నిర్ణయం సరైందని భావించినపుడు కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్ కు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ హితబోధ చేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక భారీ కథనాన్ని తన పాఠకులకు ప్రత్యేకంగా అందించడం విశేషం.
వాస్తవానికి ఇద్దరు సీఎంల ఆరు గంటల ఏకాంత భేటీలో ఎటువంటి అధికారగణం పాల్గొనలేదు. జగన్ వెంట వెళ్లిన ఎంపీలెవరూ వారిద్దరి సమావేశంలో లేరు. కనీసం కేటీఆర్, జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఏకాంత భేటీలో లేరు. కేసీఆర్, జగన్ మినహా మిగతా వారదందరూ సీఎంల ఏకాంత భేటీకి ప్రారంభ, ముగింపు దృశ్యాల్లో మాత్రమే ఉన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీఎంలు కనీసం మీడియాతోనూ మాట్లాడలేదు. కానీ ఇద్దరు సీఎం మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఆంధ్రజ్యోతి పత్రికకు మాత్రమే ‘EXCLUSIVE’గా తెలియడం గమనార్హం. ఔనూ… జగన్ లేదా కేసీఆర్ తమ ఏకాంత భేటీ సంభాషణ సారాంశాన్ని ప్రత్యేకంగా రాధాకృష్ణ పత్రికకు మాత్రమే లీక్ చేయలేదు కదా? లేదంటే వ్యక్తిగత సహాయకుల శరీరాల్లో ఆర్కే ఆత్మ పరకాయ ప్రవేశం చేయలేదుగా? అంటున్నాయట టీఆర్ఎస్ పార్టీ వర్గాలు. ఏమో…ఇద్దరు సీఎంల ఏకాంత భేటీ మథనం, అంతర్మథనపు లోగుట్టు అర్కే ఆత్మకెరుక!