బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, అదే పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమృత్ పథకం టెండర్ల అంశంలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తన బావమరిది సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి టెండర్లు కట్టబెట్టారని, బంధుప్రీతికి పాల్పడినందుకుగాను రేవంత్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోకతప్పదని, ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ అంశంలో కేటీఆర్ ఆరోపణలకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బావమరిది కాదని, గత ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి అల్లుడని పొంగులేటి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఉపేందర్ రెడ్డి నిత్యం కేటీఆర్ వెంటే ఉంటారని, కాంగ్రెస్ తరపున గెలిచిన కందాళ బీఆర్ఎస్ లో చేరినందుకు అతని అల్లుడు సృజన్ రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఏడో ప్యాకేజీలో 1,150 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని పొంగులేటి ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని, చట్టపరమైన చర్యలు తప్పవని కూడా పొంగులేటి హెచ్చరించారు.
ఈ అంశంలో కేటీఆర్, పొంగులేటిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాళ ఉపేందర్ రెడ్డి ఎంటరయ్యారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడిన కందాళ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమృత్ పథకం టెండర్ల గురించి కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారని కందాళ వ్యాఖ్యానించారు. తాను ఈ అంశంలో కేటీఆర్ తో మాట్లాడుతానని కూడా చెప్పారు. కేటీఆర్ ఆరోపణల్లో నిజం లేదని, సృజన్ రెడ్డి తన చిన్నల్లుడని, సీఎం రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని స్పష్టం చేశారు.
టెండర్లలో పనులు దక్కించుకున్న శోధ కంపెనీలో తన తన కుమార్తె డైరెక్టర్ అని, టెండర్లను వివాదం చేయడం సరికాదన్నారు. ఈ వివాదంలోకి తమను లాగి ఇబ్బంది పెట్టొద్దని, మంత్రి పొంగులేటి ఇంట్లో జరిగే శుభకార్యాలకు తాను కూడా వెడతానని, తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు వారిని కూడా పిలుస్తామన్నారు. రాజకీయాలను, వ్యాపారాలను వేర్వేరుగా చూడాలని కందాళ ఉపేందర్ రెడ్డి కోరారు. తనకు పార్టీ మారే ఆలోచన కూడా లేదని కందాళ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కేటీఆర్ అమృత్ టెండర్లను వివాదం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సొంత పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఈ అంశంలో చేసిన కీలక వ్యాఖ్యలపై గులాబీ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.