మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ఏదో అన్నారని కాదుగాని, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఇజ్జత్ కా సవాల్ కాదా ఇది? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. కర్షకుని కంట ఒలుకుతున్న కన్నీటిని తుడవాల్సిన కాల్వ మరమ్మత్తు పనుల్లో నిర్లక్ష్యం ఎక్కడ ఉంది? ఇందుకు బాధ్యులెవరనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం మీడియా సమావేశంలో ఏమన్నారు?
ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు నిత్యం పయనించే మార్గంలో కేవలం 100 మీటర్ల దూరంలో పాలేరు పాత కాల్వకు గండి పడితే పూడ్చలేరా? అని హరీష్ రావు ప్రశ్నించారు. జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయ్.. 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడం చేతకాగ.. రైతుల పొలాలు ఎండ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. కాల్వకు గండి పడి 22 రోజులైనా గండిపూడ్చాలని సోయిలేదా? ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చడం చేతకాదా? అని నిలదీశారు.
మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలు, సంధించిన ప్రశ్నల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. పాలేరు రిజర్వాయర్ దిగువన సాగర్ ఎడమ కాల్వకు పడిన గండి విషయంలో ప్రభుత్వం బద్నాం అవుతున్నదనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈనెల 1వ తేదీన వరదలవల్ల పడిన గండ్ల పూడ్చివేత విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఏదైనా పన్నాగం జరుగుతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి గండిని పూడ్చినట్లు ప్రకటించిన అధికార వర్గాలు, గత శనివారం సాయంత్రం గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే పది నిమిషాల వ్యవధిలోనే మరమ్మత్తులు చేసిన యూటీ ప్రాంతంలో మిడిల్ వాల్, స్లాబ్ కూలడంతో విడుదల చేసిన నీరు యూటీ ఏరులోకి ప్రవహించింది. గమనించిన అధికారులు వెంటనే నీటి విడుదలను నిలిపి వేశారన్నది వేరే విషయం.
సాగర్ కాల్వ మరమ్మత్తు పనుల్లో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పంటలన్నీ ఎండిపోతున్నాయని, మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు దక్కే పరిస్థితే ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోనే ఈ ఘటన జరగడం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల రైతులకు చెందిన ఆయకట్టుకు కూడా ఇదే కాల్వ ద్వారా సాగు నీరు అందాల్సిన పరిస్థితి ఉంది. నీరందక నెర్రెలు బాసిన పంట పొలాలకు నీరందించే కాల్వ మరమ్మత్తుల విషయంలో ఎందుకీ జాప్యం జరిగింది? పనుల నిర్వహణలో డొల్లతనానికి బాధ్యులెవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారగణం వైఫల్యం ముగ్గురు మంత్రుల ప్రతిష్టకు కళంకం కాదా? అసలు అధికారులకు భయ, భక్తులు ఉన్నాయా? అని అధికార పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మంగళవారం నాడు రైతులకు సాగునీరు అందజేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైతులు ఇబ్బంది పడకుండా మంగళవారం నాటికీ సాగునీరు అందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ కాల్వ విషయంలో ఏం చేస్తారో చూడాల్సిందే..!