ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు నిల్చున్న ఈ అబ్బాయి పేరు హిమాన్షు. ఔను.. తెలంగాణా సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హమాన్షే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ప్రగతి భవన్ లో ఏకాంత భేటీ సందర్భంగా అక్కడికి వెళ్లిన జగన్ హిమాన్షుకు షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
ప్రగతి భవన్ లో ఇద్దరు సీఎంల ఏకాంత భేటీ సందర్భంగా అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను అధికారికంగానే విడుదల చేశారు. కానీ హిమాన్షు వెనకాల జగన్ నిల్చుని ఉన్న ఫొటో మాత్రం అందులో లేదు. కానీ ఈ పొటో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి అసలు, సిసలు సంక్రాంతి పండుగ సంబరాలకు అవకాశం కల్పించినట్లయింది. ఇంకేముంది ఈ ఫొటోకు రకరకాల క్యాప్షన్లు, వ్యాఖ్యలను జోడిస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు.
మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షురావుతో జగన్ ఏకాంత భేటీ అయ్యారని, PUBG గేమ్ గురించి చర్చించారని, గేమ్ లో జగన్ డౌట్లు అడిగారని, వచ్చే నెలలో వీరిద్దరి భేటీ మరోసారి జరిగే అవకాశం ఉందని వెటకరిస్తూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోయి పోస్టులు వదులుతున్నారు. ఇంతకీ ఈ ఫొటో అధికారికంగా మాత్రం విడుదల కాలేదు. కానీ ఓ ప్రముఖ పత్రిక ఈ ఫొటోను ప్రచురించడం కొసమెరుపు. సదరు పత్రిక ఫొటోగ్రాఫర్ ప్రగతి భవన్ లోకి వెళ్లి పొటోలు తీసే అవకాశమే లేదు. ఇంతకీ ఈ ఫొటో ఎలా లీకైనట్లు చెప్మా!