ఖమ్మం నగరానికి చెందిన కొందరు ప్రముఖ వ్యాపారులకేమైంది? ఖమ్మం వ్యాపార రంగంలో అత్యంత ప్రముఖులుగా పేరుగాంచిన కొందరు ఉన్నట్టుండి ఎందుకు మాయమవుతున్నారు? గత కొంత కాలంగా జాడ, పత్తా లేని ఆయా ప్రముఖ వ్యాపారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? తమ వ్యాపార సంస్థలను మూసేసి ఈ ప్రముఖ వ్యాపారులు చేస్తున్న రహస్య కార్యక్రమం ఏమిటి? ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాల్లోనే కాదు, వాళ్లకు అప్పులిచ్చినవారిలో, సామాన్య ప్రజల్లోనూ రేకెత్తుతున్న ప్రశ్నలివి. ఇంతకీ ఖమ్మం వర్తక, వాణిజ్యంలో జరుగుతున్నదేమిటి?
నిజానికి ఖమ్మం వ్యాపారులకు ఇరుగు, పొరుగు జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. ఇటు విజయవాడ, అటు వరంగల్ మాత్రమే కాదు, హైదరాబాద్ నగరంలోని వ్యాపారులతో పోటీపడే విధంగా దశాబ్ధాలుగా ఖమ్మం వర్తకం సాగుతోంది. కార్పొరేట్ సంస్థలే కాదు, అంతర్ రాష్ట్ర ప్రముఖ వ్యాపార సంస్థలతోనూ ఖమ్మం వర్తకులు పోటీ పడుతున్నారు. వాణిజ్య టర్నోవర్ లో ఖమ్మం మార్కెట్ కు తిరుగులేని పేరుంది. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థతో ఇరుగు, పొరుగున గల కొన్ని జిల్లాలు కూడా పోటీ పడే పరిస్థితి లేదంటే ఇక్కడ జరిగే వ్యాపార సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఉండే ప్రముఖ వర్తక షోరూంలు, కార్ల కంపెనీలు ఖమ్మంలోనూ ఏర్పాటయ్యాయంటే ఇక్కడ జరిగే వ్యాపార టర్నోవర్ కు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలోని ప్రముఖ వ్యాపారులు కొందరు ఇటీవల అడ్రస్ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు మీడియాలో ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ప్రధాన పత్రికలతోపాటు మరికొన్ని పత్రికలు, ఇతర మాధ్యమాలు కూడా భిన్న కథనాలు ప్రచురించి, ప్రసారం చేశాయి. భారీ ఎత్తున.. అంటే సుమారు 180 నుంచి 200 కోట్ల పైచిలుకు వరకు అప్పులు చేసిన ఖమ్మంలోని ఓ ప్రముఖ వ్యాపారి గత కొన్ని నెలలుగా తన వ్యాపార సంస్థను మూసేసి తప్పించుకు తిరుగుతున్నట్లు వార్తల సారాంశం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో కార్యకలాపాలు సాగించే ఓ ఖరీదుదారు కూడా దాదాపు 40 కోట్ల వరకు అప్పులు చేసి ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వర్తకులిద్దరూ కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చినవారేమీ కాకపోవడం గమనార్హం. దశాబ్ధాలుగా వ్యాపార రంగంలో ప్రావీణ్యం గల ప్రముఖ వ్యాపారులు మాయం కావడం వెనుక అసలు సంగతి ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరికి అప్పులిచ్చిన వ్యక్తులు కక్కలేక, మింగలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. భార్యలకు తెలియకుండా భర్తలు, తండ్రికి తెలియకుండా కొడుకులు ఈ ప్రముఖ వ్యాపారులకు అప్పులిచ్చి బయటకు చెప్పుకోలేక బావురుమంటున్నట్లు సమాచారం. కాగా ఖమ్మంలోని ప్రముఖ హోటల్ యజమాని, మరో చిట్ ఫండ్ నిర్వాహకుని అంశంలోనూ ఇదే కోణంలో ప్రచారం జరుగుతోంది. కాకపోతే ప్రచారంలో నానుతున్న హోటల్ యజమానిగాని, చిట్ ఫండ్ నిర్వాహకుడుగాని స్థానికంగానే ఉండడం గమనార్హం. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికే తప్పించుకుని తిరుగుతున్న ప్రముఖ వ్యాపారుల కదలికలపై భిన్న కోణాల్లో ప్రచారం జరుగుతోంది.
ఖమ్మం నగరం నుంచి పరారైన కొందరు ప్రముఖ వ్యాపారులు తమ ఆస్తులను దొడ్డిదారిన బదిలీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పులిచ్చినవారి మొత్తాలను ఎగ్గొట్టేందుకు అత్యంత చాకచక్యంగా ఆస్తులు బదిలీ చేస్తున్నారని వర్తక వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. విలువైన ఆస్తులను బదిలీ చేశాక ఐపీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనపుడు రంగంలోకి దిగి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చేస్తోందనే ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని క్రిష్ణారావు ts29.inతో మాట్లాడుతూ, బాధితులుగాని, చర్చల్లోకి వచ్చిన ప్రముఖ వ్యాపారులుగాని తమకు ఫిర్యాదు చేయకుంటే తాము మాత్రం చేయగలిగేది ఏముంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజానీకం చర్చల్లో నానుతున్న ఓ ప్రముఖ వ్యాపారి మాత్రం తమ వద్దకు వచ్చి సమస్య నుంచి బయట పడేయాలని అభ్యర్థించారని చెప్పారు. అయితే తన ఆస్తుల విషయంలో ఆ ప్రముఖ వ్యాపారి పారదర్శకంగా తమకు సమాచారం చెప్పలేదన్నారు. ఇప్పటికే కనిపించని ఆస్తులు చేతులు మారినట్లు తమకు తెలియడం, అతను లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేయకపోవడంతో తాము ఈ సమస్యలో జోక్యం చేసుకోలేదని చిన్ని క్రిష్ణారావు వివరించారు.