వద్దిరాజు రవిచంద్ర.. గాయత్రి రవిగానూ బహుళ ప్రాచుర్యం పొందిన రాజ్యసభ సభ్యుడు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనేగాక రాష్ట్ర వ్యాప్తంగానూ అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్న నాయకుడు. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజికవర్గంలో తిరుగులేని అబిమాన నేత. నిజానికి వద్దిరాజు కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. రవిలో ఏ నరాన చూసినా కాంగ్రెస్ అభిమాన రక్తమే ప్రవహిస్తుందనే పేరు సంపాదించుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న రవి కేవలం రోజుల వ్యవధిలోనే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించే స్థాయిలో ఓట్లు సంపాదించుకున్నారు. అంతటి ప్రజాభిమానం గల వద్దిరాజు రవిచంద్ర గులాబీ పార్టీకి చెందిన కారులో రాజకీయ పయనం సాగించే అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గులాబీ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అప్పట్లో రవిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే ఇందుకు కారణంగా ఆయన అభిమానులు చెబుతుంటారు.
స్వతహాగా వ్యాపారవేత్త అయిన రవిని అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంవల్లే కాంగ్రెస్ అభిమానిగా ఉన్నటువంటి వ్యాపారవేత్త గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటి టీఆర్ఎస్ లో చేరారని ఆయన అనుయాయులు చెబుతుంటారు. పార్టీలో చేరాక కూడా ఓ ముఖ్య నేత రవిని అనేకరకాలుగా ఇబ్బందులపాలు చేశారనే విషయం బహిరంగమేనని కూడా అంటుంటారు. అధికార పార్టీ నాయకునిగా ఉన్నప్పటికీ, పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అభిమానులు ఖమ్మం నగరంలో కనీసం ఓ ఫ్లెక్సీ కట్టకుండా అడ్డుకున్న పరిణామాలను చవి చూశారు.
ఇటువంటి పరిణామాల్లోనూ రవి పార్టీ అధినేత కేసీఆర్ కు వీర విధేయునిగానే ఉన్నారు. రవిలోని సహనాన్ని, అతనికి గల అభిమానుల ఫాలోయింగ్ ను, మున్నూరుకాపు సామాజికవర్గంలో రవికి గల పట్టును పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ రాజ్యసభ అవకాశాన్ని కల్పించారు. 2022 మే నెలాఖరున రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన రవి పదవీ కాలం రెండేళ్లలోపే కావడం గమనార్హం. వచ్చే ఏప్రిల్ 2న రవి పదవీ కాలం ముగుస్తుంది. రవికి మరోసారి అవకాశం కల్పిస్తామని స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో హామీ ఇచ్చారు. వివిధ వేదకలపైనా ఇదే అంశాన్ని గులాబీ అధినేత వెల్లడించారు.
తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించిన పార్టీ చీఫ్ కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు గడచిన రెండేళ్ల కాలంలో రవి శాయశక్తులా ప్రయత్నించారు. ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు గల ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల ఇంచార్జి బాధ్యతలను సంతోషంగా స్వీకరించారు. పార్టీ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ శ్రమ ఎంతవరకు వెళ్లిందంటే..? రూ. కోట్ల మొత్తం చేతి చమురు వదిలించుని మరీ పార్టీ అభ్యర్థుల విజయానికి పాటుపడ్డారు. తనకు పదవీ యోగాన్ని కల్పించిన పార్టీ అధినేత రుణం తీర్చుకునేందుకు మొన్నటి ఎన్నికల్లో రవి పడిన శ్రమకు ఫలితం దక్కలేదనేది వేరే అంశం. ఇందుకు కారణాలు అందరికీ తెలిసినవే.
వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రీ రవి గురించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం పూర్తయిన మూడు స్థానాలకు ఈనెల 27వ తేదీన ఎన్నిక జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 15వ తేదీ చివరి గడువు. మారిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈసారి దక్కేది ఒక్క సీటు మాత్రమే. ఈ సీటును గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ఎవరికి కేటాయిస్తారు? పార్టీకి రవి చేసిన సేవలను గుర్తిస్తారా? లేదా? మరోసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకుంటారా? లేదా? ఇటువంటి అనేక ప్రశ్నలు వద్దిరాజు అభిమానుల్లో, అనుయాయుల్లో రేకెత్తుతున్నాయి. కేసీఆర్ ఏం చేస్తారన్నదే రవి అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది.