ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వేడిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాడిన ‘భావోద్వేగ భాష’పై ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు అక్కడి రాజకీయ నేతలు ఆడిపోసుకున్న సంగతి తెలిసిందే కదా? రాష్ట్ర ఆవిర్భానంతరం తెలంగాణాకు చెందిన విపక్ష పార్టీల నేతలు కూడా సీఎం కేసీఆర్ భాషపై ఇప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. ఉద్యమ వేడి సందర్భాన్ని వదిలేయండి..సీఎం అయ్యాక కోపం వచ్చినపుడు కేసీఆర్ సార్ ఏమంటారు?
విపక్ష పార్టీ నేతలను ఉద్దేశించి సన్నాసులు అంటారు. లేదంటే దరిద్రులు అంటారు. బీజేపీ నేతలను మనసులో పెట్టుకుని ఇందుగాళ్లు, బొందుగాళ్లు అంటారు. పలు సందర్భాల్లో పలువురు నాయకులను ఉటంకిస్తూ లత్కోర్లు, లఫంగులు, బఫూన్లు అంటారు. మహా అయితే చెప్రాసీలు అంటారు. దరిద్రులు, అర్భకులు, చవటలు, విలన్లు, ఎనిమీలు అంటుంటారు. ఇంకా కోపమొస్తే ఏదో అన్యాపదేశంగానో, ఉద్దేశపూర్వకంగానో ‘వాడు, వీడు’ అనే పదాలు ఎక్కడైనా వాడితే వాడి ఉండవచ్చు. ఇంతకన్నా ఘోరమైన పదాలను, పత్రికల్లో రాయలేని బండ బూతులు మాత్రం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లించిన దాఖలాలు బహుషా లేకపోవచ్చు.
ఈ మాత్రం దానికే కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకులు కేసీఆర్ భాష మార్చుకోవాలని, సంస్కారవంతంగా మాట్లాడాలని హితవు చెబుతూ, మర్యాద నేర్చుకోవాలని విమర్శలు చేస్తుంటారు కదా? ఇవేంతిట్లు..? ఇదేం భాష? అని ప్రశ్నిస్తుంటారు కదా? కేసీఆర్ సార్ వాడిన ఆయా తరహా పదాలపై ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ సందర్భానుసార వర్ణన తీరు వేరే అనుకోండి.
సరే..కేసీఆర్ అనేక సందర్భాల్లో వాడిన ఆయా పదాలే తిట్ల దండకమైతే.. పరుష పదాలైతే..పత్రికల్లో రాయలేని వ్యాఖ్యలైతే..? ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వాడుతున్న భాషా ప్రావీణ్యతను ఎలా వర్ణించాల్సి ఉంటుంది? ఇదీ అసలు, సిసలు తాజా ప్రశ్న. వాస్తవానికి తెలంగాణా సీఎం కేసీఆర్ తన పరిభాషలో ఏ నాయకున్ని కూడా ‘బాడీ షేమింగ్’ చేసి ఉండరు. కుంటోడు, గుడ్డోడు, ఒంటి కన్నుగాడు, అమ్మా మొగుడు, అక్క మొగుడు వంటి ఘాటైన పదజాలాన్ని కూడా వాడిన దాఖలాలు లేవు. ఆ మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేతలపై వాడిన భాషా ప్రావీణ్య దండకం పరిపరి విధాల చర్చకు దారి తీసిందన్నది వేరే విషయం.
ఇదిగో ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతల తిట్లపర్వాన్ని మరిపిస్తూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వాడిన పద ప్రయోగం తీవ్ర వివాదాస్పదమైంది. మూడు రాజధానులకు మద్దతుగా కాకినాడ పట్టణంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో చంద్రశేఖరరెడ్డి అటు చంద్రబాబుపైన, ఆయన తనయుడు లోకేష్ పైన, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాన్ పైన వాడిన తిట్ల దండకాన్ని ఇక్కడ అక్షర రూపంలో రాయలేం గాని, దిగువన గల వీడియోలో వింటూ..వీక్షించండి. వీలైతే ‘ఇయర్ ఫోన్స్’ ధరించండి. ఎందుకంటే చిన్నపిల్లలు వినకూడదు మరి. ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ‘తిట్ల దండకం’ ఆసాంతం విన్నాక, అవకాశం లభిస్తే ఏపీ సీఎం సారును ఓ మాట అడగండి ‘జగన్ బాబూ నువ్ చెప్పు…కేసీఆర్ సార్ ‘బాస’ వేస్ట్ కదా! అని. ఆయన్నెందుకు అడగడం అని అమాయకంగా ఫేసెట్టమాకండి. శ్రీమాన్ చంద్రశేఖర్ రెడ్డిగారు వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యేనే.. అందుకని.