ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. ఈమేరకు ఆయా ఛానల్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆర్కే అడిగిన పలు ప్రశ్నలకు పొంగులేటి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించిందని, సంకెళ్ల నుంచి బయటకు వచ్చానని పొంగులేటి అన్నారు. ‘మీ నిజస్వరూపం తెలుసుకోకపోవడం మా తప్పు అన్నా, వారిని తప్పు పట్టలేదు, గౌరవనీయులు వారినెందుకు తప్పు పడతా..?’ అని కేసీఆర్ ను ఉద్ధేశించి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ‘తడిగుడ్డతో గొంతు కోశావంటేనే నీకు కోపమొస్తది రాజకీయంగా.., అనుభవించేవాడికి ఎంత ఉంటుంది అవేదన..?’ అని ప్రశ్నించారు. తన దగ్గరే ధనబలం ఉందంటే.. ప్రజాప్రతినిధులుగా వాళ్లు చేసిన స్కాములు, వాళ్ల దగ్గరున్న డబ్బుతో పోలిస్తే తన దగ్గరున్న డబ్బు నథింగ్.. సందర్భం వచ్చినప్పుడు ఆ సిస్టమ్ గురించి కూడా చెప్తా.. అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అన్ని అంశాల్లో తాను మెంటల్ గా ప్రిపేర్ అయ్యానని, ఎంత దూరమూనా రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని ఏపీ సీఎం వైెఎస్ జగన్ కేసీఆర్ ను అడిగారని, కానీ సీఎం కేసీఆర్ నో చెప్పారని పొంగులేటి వెల్లడించారు. షర్మిల పార్టీలో చేరే అంశంపై వ్యాఖ్యానిస్తూ, తాను మెడ కోసుకోలేనని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క అభ్యర్థినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వననే శపథాన్ని పొంగులేటి పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ ను ఇంటికి పంపడమే తన ‘ఎండ్ గోల్’గా పొంగులేటి చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నిర్వహించిన ఇంటర్వ్యూ ఈ ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారమవుతుందని ఏబీఎన్ సంస్థ వెల్లడించింది.