‘పోలీసులతో వ్యవహారం ఎలా ఉంటదో ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నాకు తెలియదు. ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మా ఆయన లేకుండా, నా అంతట నేను ఒక సమస్యపై పోరాటానికి బయటకు వచ్చాను’ అని అంటున్నారు విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ. అమరావతి రాజధాని ‘మూడు ముక్కల’ అంశంలో మాధవీ శ్రీనివాస్ అనే మహిళ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అసలు తాను రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చిందో, ర్యాలీలో పాల్గొని, అరెస్టయి, రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉండి, ఆ తర్వాత విడుదలైనట్లు పేర్కొన్న ఆమె.. తాను చవి చూసిన పోలీసు అనుభవం ఏమిటో ఈ పోస్టులో వివరించారు. ఆమె మాట్లోనే చదవండి.
‘‘లేడీస్ అందరం అమరావతికి సపోర్టుగా ఒక ర్యాలీ చేయాలని అనుకుంటున్నామని నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. అనారోగ్యంతో ఉన్న కూడా నా వంతుగా నేను చేయగలిగింది ఇంతకన్నా ఏముంటుంది? అని తప్పని సరిగా పాల్గొనాలని సిద్ధమయ్యాను. విషయం వారికి చెప్పాను, ఆయన కూడా “వెళ్తావా, సరే వెళ్ళు” అన్నారు.
వెన్యూ ఎక్కడ అనేది రకరకాల గందరగోళాల మధ్య సరిగా నిర్ణయం కానీ స్థితిలో సరే ఏదైతే అదే అయింది. ముందైతే బెంజ్ సర్కిల్ కి వెళ్దాం, అక్కడినుంచి చూద్దాం అని బయలుదేరాను. బెంజ్ సర్కిల్ కి చేరుకున్న తర్వాత అందరూ వస్తున్నారు. చుట్టూ పక్కల సందుల్లో నుంచి మెయిన్ రోడ్ లో నుంచికొద్దీ కొద్దీగా వస్తున్నారు. గుంపుగా కాకుండా కొద్ది మందిమి బృందాలుగా నడుస్తున్నాం.
ఈ లోపు పోలీసులు వచ్చి మా చుట్టు తిరగటం మొదలు పెట్టారు ఎందుకు తిరుగుతున్నారు అంటే మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? లాంటి వివరాలు అడుగుతున్నారు. ఎందుకు మీకు ఆ వివరాలు అని వాళ్లను అడిగాం. మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది షాపింగ్ కి వచ్చాము అని చెప్పాము.
ఈ వాదనలు, ప్రశ్నలు, జవాబులు కొద్దిసేపు జరిగాక మమ్మల్ని పోలీసులు చుట్టుముట్టి బస్సు ఎక్కండి.. బస్సు ఎక్కండి అని అనడం మొదలు పెట్టారు.
మేము ఎందుకు ఎక్కాలి? అని మేము ప్రతిఘటించాము.ఈ లోపు చాలామంది లేడీస్ చుట్టుపక్కల సందులో నుంచి మెయిన్ రోడ్డు మీద చేరుకున్నారు పోలీసులు ఇక్కడికి అక్కడికి పరుగులు తీయడం మొదలెట్టారు. ఈ హడావుడి అంతా చూసి రోడ్డుమీద వెళుతున్న లేడీస్ కూడా విషయం తెలుసుకొని మాతో కలిశారు.
ఇంతలో మేమందరం ఫుట్పాత్ మీద నుంచి మెయిన్ రోడ్ లోకి రావడం జరిగింది. ఎంతో క్రమశిక్షణతో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఓ పక్క నుంచి మేము నడుస్తుంటే పోలీసులు అత్యుత్సాహం చూడటం మొదలెట్టారు. ఎక్కడికక్కడ చుట్టుముట్టడం, బస్సులో కుక్కటం, బలవంతంగా ఈడ్చుకెళ్తము, నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇలాంటివన్నీ జరిగినాయి. మొదటగా నన్ను బస్సు ఎక్కించారు. తర్వాత వరుసగా గ్రూప్ లో అందరిని బస్సు ఎక్కించారు. బస్ తీసుకెళ్లి పోలీస్ గ్రౌండ్స్ లో పెట్టారు.
మమ్మల్ని అక్కడికి దించారు. ఆ తర్వాత ఇంకొద్ది మందిని అలా విడతలవారీగా తీసుకొచ్చారు. సాయంత్రం అవుతుంది మమ్మల్ని రిలీజ్ చేయటం లేదు. ఎందుకు రిలీజ్ చేయట్లేదు.. మేమేం చేశాము అని ప్రశ్నిస్తే వివరాలు తీసుకుని పంపిస్తామని చెప్పారు.
సరే వివరాలు అడిగితే ఇవ్వటం మొదలెడితే మీ పేరు, ఇంటి పేరు, మీ ఫోన్ నెంబరు, ఫోటో ఇవ్వాలి అన్నారు. ఫోన్ నెంబరు ఎందుకు ఇవ్వాలి? అని ఫోన్ నెంబర్ ఇవ్వటానికి నిరాకరించాము.
దానిమీద చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. సరే కొద్దిసేపటి తర్వాత కొంతమంది ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఫోన్ నెంబర్ ఇస్తున్నప్పుడు మాకు తెలియకుండా మా ఫోటోలు తీయడం మొదలెట్టారు. అది గమనించిన కొంతమంది లేడీస్ ఫోటోలు ఎందుకు తెస్తున్నారని అక్కడున్న పోలీసు అధికారుల్ని నిలదీశారు.
చాలా పెద్ద గొడవ చేశాము. సరే ఫోటోలు తీసుకోము అని చెప్పారు కానీ నాకు డౌటే, మా ఫోటోలు తీసే ఉంటారు దూరం నుంచైనా.
తరువాత కులం గురించి అడిగారు. మీరు ఏ కులము చెప్పమన్నారు. అసలు కులం అవసరం ఏంటి? మేము ఒక సోషల్ కాజ్ కోసం బయటకు వచ్చాము. మేము ఎటువంటి నేరచరిత్ర లేదు. దోపిడీ చేయలేదు, దొంగతనాలు చేయలేదు, మోసాలు చేయలేదు, అయినా మమ్మల్ని అరెస్ట్ చేశారు, సరే వివరాలు అడిగారు ఇస్తున్నాం, మరి మా కులం ఎందుకు మీకు? అని అందరం ప్రశ్నించాం. కులం ససేమిరా చెప్పము అని చెప్పాం. కాదు కులం కంపల్సరీ అని వాళ్ళు అన్నారు. మేం కులం చెప్పము అని భీష్మించుకు కూర్చున్నాము. అనేక తర్జన భర్జనల తర్వాత కులం చెప్పకుండానే మిగతా వివరాలు ఇచ్చి బయటికి వచ్చాం.
అప్పటికి సమయం తొమ్మిది గంటలయింది. ఆరు గంటల తర్వాత మహిళలను పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఉన్నా కూడా ఈ పోలీసులు మమ్మల్ని రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు.
విజయవాడ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగినట్టు నేను వినలేదు, చదవలేదు, చూడలేదు.
పోలీస్ స్టేషన్ అంటే పైన బోర్డుని చూశాను. కానీ పోలీసులతో వ్యవహారం ఎలా ఉంటదో ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నాకు తెలియదు. ఇన్నేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మా ఆయన లేకుండా, నా అంతట నేను ఒక సమస్యపై పోరాటానికి బయటకు వచ్చాను.
ఎందుకంటే?
ఇది నా రాజధానికి సంబంధించిన విషయం .
నా రాష్ట్రానికి సంబంధించిన విషయం.
నా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకేనేమో ఎప్పుడూ లేని తెగింపు వచ్చింది. నేనొక్కదాన్నే కాదు ఈ రోజు బయటకు వచ్చినా అందరిలోనూ ఇదే ఆలోచన ఉండొచ్చు. ఇదే ఆవేశం ఉండొచ్చు. ఈరోజు సమస్యని అర్థం చేసుకోవడమే కాదు పోరాటానికి కూడా ధైర్యం వచ్చింది. మహిళగా నా హక్కులు కూడా తెలుసుకున్నాను.
రాజధాని నగరంలో నాకేమీ గజం స్థలం లేదు. కానీ అమరావతి నా రాజధాని.
దాన్ని పరిరక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం.
కొండ మీద దుర్గమ్మ ఉన్నంతకాలం అమరావతినిగాని, ఆంధ్ర రాష్ట్రాన్నిగాని ఎవరూ ఏమీ చేయలేరు అని గట్టిగా నమ్ముతాను.’’
ఇట్లు
మీ మాధవి శ్రీనివాస్