రాజకీయాల్లో ఒక్కోసారి గమ్మత్తు జరుగుతుంటుంది. కల గనని సీన్లు కూడా కళ్లముందు కనిపిస్తుంటాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే నానుడిని నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అనుమతి లేనిదే అడుగు మోపరాదని అల్టిమేటమ్ జారీ చేసిన పరిస్థితులకు భిన్నంగా, రండి.. రండి.. దయ చేయండి.. అంటూ ఆహ్వానం అందితే ఏ నాయకుడికైనా అంతకన్నా సంతోషం ఏముంటుంది..? ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వర్ రావు సరిగ్గా ఇటువంటి సానుకూల వాతావరణాన్నే ప్రస్తుతం ఆస్వాదిస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు సహా పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడు, అందులోనూ లోక్ సభలో బీఆర్ఎస్ సభాపక్ష నాయకుడు ఇటువంటి చిత్ర, విచిత్ర ఫలితాన్ని ఎంజాయ్ చేయడమేంటీ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
నామ నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభా పక్ష నేతే కావచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడే కావచ్చు. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఎమ్మెల్యేగా ఓటమి పాలైన లీడరే కావచ్చు. ఆ తర్వాత అంటే సుమారు నాలుగైదు నెలల వ్యవధిలోనే టీడీపీ కండువాను తీసేని, అప్పటి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పంచన చేరి గులాబీ కండువా కప్పుకున్న ఒకప్పటి చంద్రబాబునాయుడి సన్నిహితుడే కావచ్చు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే పార్టీ మారి, సిట్టింగ్ ఎంపీని పక్కకు తోసేసి ఖమ్మం ఎంపీగా టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్న స్మార్ట్ లీడరే కావచ్చు. ఏదైతేనేం…? పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఎంపీగా ఆయన గెలుపొందారు. ఆ తర్వాత లోక్ సభా పక్ష నేతగా నామ ఎన్నికయ్యారు. అయితే మాత్రం ఏం లాభం…?
ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరిగే స్వేచ్ఛ కూడా ఆయనకు లేకుండా పోయింది. పార్టీ పాలసీ ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం. అధికార పార్టీకి చెందిన మరే ఇతర నాయకుడైనా ఏదేని అసెంబ్లీ సెగ్మెంట్ లో తిరగాలంటే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి అవసరం. సంబంధిత ఎమ్మెల్యే కనీసం సుముఖతనైనా వ్యక్తం చేస్తే తప్ప ఇతర నాయకులెవరూ నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదనేది బీఆర్ఎస్ రాజకీయాల్లో బహిరంగమే. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో గల ప్రచారం ప్రకారం.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఈ విషయంలో అనేక చేదు ఫలితాలను చవి చూశారట. తమ నియోజకవర్గాల్లో తిరిగేందుకు ఎమ్మెల్యేలెవరూ ఆయనను అనుమతించలేదట. ‘ఖమ్మం జిల్లాలో అడుగు మోపాలంటేనే ఆందోళన కలుగుతోంది. కనీసం నా ఇంటిక వెళ్లాలన్నా ఏదో ఒక నియోజకవర్గం మీదుగా వెళ్లాల్సిందే. హైదరాబాద్ నుంచి వెడితే పాలేరు, వరంగల్ జిల్లా మీదుగా వెడితే వెడితే ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల మీదుగా వెళ్లాలి. కృష్ణా జిల్లా మీదుగా వెడదామన్నా సత్తుపల్లి, వెస్ట్ గోదావరి నుంచి వెళ్లాలన్నా అశ్వారావుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలాగైతే నేను హెలీ కాప్టర్ ద్వారా ఖమ్మంలోని నా ఇంటికి వెళ్లాలా?’ అని పరిస్థితులపై ఎంపీ నామా నాగేశ్వర్ రావు తన అనుచరులతో, అనుయాయులతో వ్యాఖ్యానిస్తూ తరచూ బాధపడేవారని ఓ కథనం ప్రచారంలో ఉంది. దీంతో కనీసం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని నామా ఆవేదన చెందేవారట. కానీ ఇప్పుడు సీన్ మారింది..
ప్రస్తుతం అనేక మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు నామ నాగేశ్వర్ రావు పర్యటన కోసం సుమఖత వ్యక్తం చేస్తున్నారట. రా..రమ్మని స్వయంగా ఆహ్వనిస్తున్నారట. తాజా స్థితికి బలం చేకూరేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నామ నాగేశ్వర్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు లేని సమయాల్లో గతంలో వారానికి ఒకటి, రెండు రోజులు తన నియోజకవర్గ పరిధిలో పర్యటించడం కూడా నామ నాగేశ్వర్ రావుకు గగనంగా ఉండేదట. ప్రస్తుతం వారాల తరబడి ఆయన జిల్లాలో మకాం వేసి పర్యటించే అవకాశం లబించడం గమనార్హం. ఇందులో భాగంగానే ఆయన సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పర్యటిస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నామ నాగేశ్వర్ రావు పర్యటనకు ఎమ్మెల్యేల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయట. దీంతో నామా వర్గీయులు తెగ సంబరపడిపోతున్నారు.
నాలుగేళ్లుగా ఎమ్మెల్యేల అనుమతి లేనితే అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించలేని ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్న నామ నాగేశ్వర్ రావుకు ఇప్పుడీ సానుకూల స్థితి ఎందుకనుకుంటున్నారా? అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహత్యమట. బీఆర్ఎస్ చీప్ కేసీఆర్ ను, ఆ పార్టీని టార్గెట్ చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ కదలికలు అధికార పార్టీలో ప్రకంపనలకు దారి తీసినట్లు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులదరూ కలిసికట్టుగా పొంగులేటిని ఎదుర్కోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈమేరకు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమై పొంగులేటిని ఎదుర్కోవడం ఎలా? అనే అంశంపై ఎజెండాను రూపొందించుకున్నారు. పొంగులేటి పుణ్యమా.. అని తమ నాయకుడికి సందు దొరికిందని, ఈ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటున్నామని ఎంపీ నామ నాగేశ్వర్ రావు వర్గీయులు తెగ మురిసిపోతున్నారు. మరో పది నెలలపాటు తమ నాయకుడి పర్యటనలను అడ్డుకునేవారు ఉండకపోవచ్చని వారు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి ఎంపీ నామ నాగేశ్వర్ రావుకు ప్రస్తుతం లభిస్తున్న గౌరవం రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే సామెతకు అతికినట్టేగా..!