ఒక దురాగతం…అమానుషం…దుర్మార్గం…ఘోరం ఎన్ని పదాలు వాడినా సరిపోని నేరం. పిచ్చోడిగా కుటుంబ సభ్యులు చెబుతున్న కూర సురేష్ అనే వ్యక్తి మెజిస్టీరియల్ అధికారాలు గల ఓ మహిళా తహశీల్దార్ ను పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తే…సభ్య సమాజాన్ని ఉద్ధరిస్తామని ప్రగల్బాలు పలికే జర్నలిస్టు కలాలు కొన్ని ఆమెపై విషాన్ని చిమ్ముతున్నాయి. పరోక్షంగా ఆటవిక న్యాయం అనివార్యమైందనే భావన స్ఫురించే విధంగా అక్షర నివేదన చేస్తున్నాయి. ఆధారాలు లేని సోషల్ మీడియా పోస్టులను పట్టుకుని చిలవలు, పలవలుగా కలవరిస్తున్నాయి. అప్పటికీ తామేదో సుద్ద పూసలైనట్టు.
ఆరోపణలు వేరు…వాస్తవాలు వేరు. రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని, అక్రమాలను చర్చించడానికి ఇది సమయమూ కాదు…సందర్భమూ కాదు. రెవెన్యూ అధికారుల, సిబ్బంది అవినీతిని సమర్ధించేవారు కూడా ఎవరూ లేరు. కానీ తహశీల్దార్ విజయారెడ్డి ఉదంతాన్ని సాకుగా చూపి ‘భలే జరిగింది’ అని పైశాచికానందం పొందుతున్న కొన్ని జర్నలిస్టు కలాల కల్మష మస్తిష్కాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది. జర్నలిస్టులందరూ సత్యహరిశ్చంద్రుని వారసులా? ఎందరు జర్నలిస్టులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం లేదు. తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఏవేని వివాదాలు ఏర్పడితే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవడం లేదు? అప్పటికీ తాము పత్తిత్తులమైనట్లు ఈ తరహా జర్నలిస్టు కలాలు సూక్తులు వల్లిస్తున్నాయి. ఓ ఘోర చర్యపై నీతి లేని హితపు రాతలు రాయడాన్ని బట్టే అవగతం చేసుకోవచ్చు వారి నీతి, నిజాయితీల గురించి. సభ్య సమాజం తలదించుకునే రీతిలో దారుణ హత్యకు గురైన ఓ మహిళా అధికారి అంశంలో కొన్ని జర్నలిస్టు కలాలు స్పందిస్తున్న తీరు చదివాక అనివార్యంగా స్పందించవలసిన అవసరం ఏర్పడింది. విజయారెడ్డి రూ. కోట్లు సంపాదించిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నిరాధార పోస్టులను ప్రామాణికంగా చేసుకోవడం జర్నలిస్టు బాధ్యతేనా? విజయారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎప్పుడైనా పట్టుకున్నారా? కేసులు నమోదు చేశారా? అరెస్ట్ చేశారా? పోనీ ఇన్నేళ్ల ఆమె సర్వీసులో ప్రభుత్వం ఆమెపై ఏవేని చర్యలు తీసుకుందా? ఈ ప్రశ్నలకు జవాబులు లేకుండా అమానుషానికి బలైన తహశీల్దార్ పై నిందలు మోపడం కల్మష జర్నలిస్టు కలాలకు సబబేనా? ఉదాహరణకు విజయారెడ్డి అక్రమ సంపాదనతో కోట్లు కూడబెడితే చంపేస్తారా? చట్టం, కేసు, విచారణ, న్యాయం వంటి ప్రక్రియలు అవసరం లేదా? రెవెన్యూశాఖలో అవినీతికి, విజయారెడ్డి దారుణ హత్యకు ముడి వేయడం సముచితమేనా? రెవెన్యూ వ్యవస్థలోని అవినీతి వేరు. విజయారెడ్డి దారుణ హత్యోదంతపు ఘటన వేరు. అసలు సురేష్ కు సంబంధించిన భూవివాదమే అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయ పరిధిలోకే రాదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ ప్రకటించారు. విజయారెడ్డి హత్యలో కొందరు రాజకీయ నేతల హస్తమున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి అంశాల్లో పరిశోధన చేయడం విషం చిమ్మే కలాలకు ఎన్నడూ అలవాటు లేదు. ‘వాళ్లెవరో చెప్పారు…మేం రాశాం. అయితే ఏంది?’ అని ప్రశ్నించడమే ఈ కల్మష కలాల నైజం.
ఆరోపణలు ఎందరిపైనో ఉన్నాయి. తప్పు చేయలేదని భావించేవారు కొందరు విచారణను ఎదుర్కుంటారు…తప్పు చేసినవారు విచారణకు భయపడి స్టేలు తెచ్చుకుంటారు. అంతే తేడా…చనిపోయిన అధికారిపై విషం చిమ్ముతున్న ఈ జర్నలిస్టు కలాల సర్వీసు ఎంత? అవి పనిచేసిన సంస్థలేమిటి? ఇందుకు సంస్థలు ఇచ్చిన జీతాలేమిటి? కుటుంబ ఖర్చులేమిటి? ప్రస్తుత సంపద ఎంత? ఇప్పటి ఈ విలాసవంతమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? అనే అంశాలపై విచారణ జరిపితే బట్ట కాల్చి మీద వేసే వైభోగపు రాతల అసలు స్వరూపం బహిర్గతం కాక తప్పదు.
పెట్రోలు పోసి సజీవ దహనం చేయడమే తక్షణ న్యాయమైతే ఎంత మంది అవినీతి పరులను ఇందుకు ఎంపిక చేయాలి? మరెందరు ప్రభుత్వ అవినీతి అధికారులను వరుసలో నిల్చోబెట్టాలి? ఏకంగా ఏసీబీ దాడుల్లో దొరికినవారిని ఏం చేయాలి? ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎంపికైతే నాలుగు తరాలకు సరిపడా స్థిర, చరాస్తులను పోగేసుకుంటున్న కొందరు రాజకీయ నేతలను ఏం చేయాలి? ఏయే రాజకీయ నాయకుడిని ముందు వరుసలో ఉంచాలి? వీళ్లనే కాదు మీడియా ముసుగులో కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు జర్నలిస్టులను ఎలా చంపాలి? ఇలా చంపుకుంటూ పోతే చట్టాలు ఎందుకు? కోర్టులు ఎందుకు? సత్వర న్యాయమే అనివార్యమైతే అందరినీ చంపేద్దామా మరి? వ్యక్తులపైనే కాదు అనేక వ్యవస్థలపైనా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు వేరు…వాస్తవం వేరు. అందుకే ఆటవిక న్యాయం కాదు కావలసింది. చట్టపరమైన న్యాయం మాత్రమే.
‘పోయినోళ్లందరూ మంచోళ్లు…ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు’ అన్నారు ఓ కవి. సానుభూతి చూపకపోయినా ఫరవాలేదు… పోయినోళ్లను నిరాధారంగా నిందించకండి.
-ఎడమ సమ్మిరెడ్డి